
ముందస్తు నిర్బంధంలో లఖ్వీ
మూడు నెలల పాటు జైలులోనే లఖ్వీకి బెయిల్‌పై భారత్ నిరసనతో పాక్ నిర్ణయం
కరడుగట్టిన ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం షాక్‌కు గురిచేసిందన్న మోదీ
పాక్ తీరును గర్హిస్తూ పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి జకీఉర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్‌పై జైలు నుంచి బయటకురాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డుకుంది. ముందస్తు నిర్బంధ చట్టం కింద అతన్ని మూడు నెలలపాటు నిర్బంధించింది. నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ఆపరేషన్స్ కమాండర్ లఖ్వీకి పాక్ కోర్టు బెయిల్ ఇవ్వడంపై భారత్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడం, పెషావర్ సైనిక స్కూలులో నరమేధంతో అంతర్జాతీయ మీడియా దృష్టి సారించిన దృష్ట్యా పక్ ఈ చర్య చేపట్టింది. ప్రస్తుతం రావల్పిండి అడియాలా జైలులో ఉన్న లఖ్వీ శుక్రవారం ఉదయం బెయిల్‌పై విడుదలకావాల్సి ఉంది. అయితే అంతకుముందే పాక్ అధికారులు స్పందించారు. ప్రజా భద్రత నిర్వహణ(ఎంపీవో) చట్టం నిబంధనలను ప్రయోగించి, లఖ్వీ జైలు నుంచి బయటకురాకుండా ఉత్తర్వులిచ్చారు. జైలు అధికారులకు సంబంధిత ఉత్తర్వుల కాపీని అందించారు.
ఈ విషయాన్ని భారత్‌కూ తెలియజేశారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని పాక్ నిర్ణయించింది. సోమవారం కోర్టులో పిటిషన్ వేయనుంది. పెషావర్‌లో 148 మంది స్కూలు పిల్లలను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన నేపథ్యంలో లఖ్వీని విడుదల చేస్తే అంతర్జాతీయంగా పాక్‌కు చెడ్డపేరు వస్తుందని షరీఫ్ అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై భారత్ నుంచీ ఒత్తిడి వస్తుందని, లఖ్వీని ఎలాగైనా నిర్బంధంలోనే ఉంచాలని ప్రధాని ఆదేశించినట్లు వెల్లడించాయి. మరోవైపు ముంబై దాడుల కేసులో మరో 15 మంది సాక్షులను విచారించకుండానే లఖ్వీకి కోర్టు బెయిల్ ఇవ్వడంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
బెయిల్‌ను రద్దు చేయండి: భారత్
లఖ్వీ బెయిల్ రద్దయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను భారత్ గట్టిగా కోరింది. లఖ్వీకి బెయిల్ ఇవ్వడంపై పార్లమెంట్ శుక్రవారం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పాక్ కోర్టు నిర్ణయాన్ని లోక్‌సభలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ముంబై దాడి ముష్కరులకు శిక్ష పడేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నాయి. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. లఖ్వీకి బెయిల్ రావడం షాక్‌కు గురి చేసిందన్నారు. పాక్ పిల్లల ఊచకోతపై బాధతో బరువెక్కిన గుండెలు ఇంకా తేలికపడకముందే ఈ నిర్ణయం వెలువడటం దారుణమన్నారు. దీనిపై భారత అభ్యంతరాలను పాక్‌కు గట్టిగా చెప్పామని, పార్లమెంట్ వ్యక్తం చేసిన అభిప్రాయాల మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంద పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌కు చిత్తశుద్ధి లేదని లఖ్వీ బెయిల్‌తె రుజువవుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. బెయిల్‌ను ఉపసంహరించుకోవాలనిడిమాండ్ చేశారు. ముంబై దాడుల బాధ్యులకు శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత పాక్‌దేనని వ్యాఖ్యానించారు.
పాక్‌లో 67 మంది మిలిటెంట్ల హతం
పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో శుక్రవారం ఆ దేశ భద్రతా బలగాలు మిలిటెంట్ల స్థావరాలపై భారీ ఎత్తున జరిపిన దాడిల్లో 67 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఫజ్లుల్లాపై ద్రోన్ దాడులకు పాక్ నిర్ణయం
పెషావర్‌లో నరమేధం సృష్టించిన తాలిబాన్ మిలిటెంట్లతో ఫోన్ సంభాషణలు సాగించిన తెహ్రీక్ ఎ తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజ్లుల్లాపై ద్రోన్ దాడులు జరపాలని పాక్ సైన్యంతోపాటు అఫ్ఘాన్‌లోని సంకీర్ణ దళాలు నిర్ణయించాయి.