
వాషింగ్టన్ / ఇస్లామాబాద్ / ఐరాస: లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలకు స్వర్గధామంగా మారిన పాక్‌పై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రమూకలకు సాయం చేయడం ఆపకపోతే పాక్ చాలా కోల్పోవాల్సి వస్తుందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హెచ్చరించారు. ఉగ్రస్థావరాలపై పాక్ వైఖరిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు అకస్మిక పర్యటనలో భాగంగా పెన్స్ గురువారం అఫ్గానిస్తాన్ చేరుకున్నారు.
అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ, ప్రధాని అబ్దుల్లాలతో సమావేశమయ్యారు. తర్వాత బగ్రామ్ ఎయిర్‌బేస్‌లో అమెరికా సైనికులతో మాట్లాడారు.‘అధ్యక్షుడు ట్రంప్ చెప్పిందే నేనూ చెబుతున్నా. అమెరికాతో భాగస్వామ్యం వల్ల పాక్ చాలా లబ్ధి పొందు తోంది. ఉగ్రవాదులు, నేరస్తులకు ఆశ్రయమివ్వడం వల్ల పాక్ చాలా కోల్పోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వెతికి హతమార్చేందుకు అమెరికన్ బలగాలకు ట్రంప్ పూర్తిస్వేచ్ఛ ఇచ్చినట్లు పెన్స్ వెల్లడించారు. మరోవైపు పెన్స్ వ్యాఖ్యల్ని పాక్ ఖండించింది.