
రమ్యకు ప్రేమతో..
బెంగళూరు: కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య పాకిస్థాన్లో 'మీడియా సెలబ్రిటీ'గా మారిపోయారు. తమ దేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు, తర్వాత పరిణామాలకు సంబంధించిన వార్తలకు పాక్ ప్రింట్, టీవీ మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 'పాకిస్థాన్ నరకం కాదు' అంటూ రమ్య వ్యాఖ్యానించడంతో వివాదం చెలరేగింది. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కర్ణాటక కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ నేపథ్యంలో రమ్యకు సంబంధించిన కథనాలను పాక్ మీడియా పతాక స్థాయిలో ప్రచారం చేసింది. 'పాకిస్థాన్ ను ప్రశంసించినందుకు భారతీయ నటిపై దేశద్రోహం కేసు పెట్టార'ని డాన్ ప్రతిక కథనం ప్రచురించింది. అంతేకాదు పాఠకుల అభిప్రాయాలు ఆహ్వానించింది. పాకిస్థాన్ కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలకు భారత నటి క్షమాపణ చేప్పేందుకు నిరాకరించిందని 'డైలీ పాకిస్థాన్' ప్రచురించింది. 'పాకిస్థాన్ నరకం కాదు. ఇట్లు రమ్య' శీర్షికతో డైలీ టైమ్స్ కథనం రాసింది.
రమ్య అసలు పేరు దివ్య స్పందన అని, పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడినందుకు ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారని జియో న్యూస్ వార్తా చానల్ తెలిపింది. పాఠకులు మాత్రం భారత్, పాకిస్థాన్ పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేయడం విశేషం.