
ఉభయసభలు వాయిదా.. ప్రధాని ఆవేదన!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు రగడ గురువారం కూడా పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఈ విషయమై లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగడంతో రెండు సభలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సభ్యుల నిరసనతో మొదట రాజ్యసభ ఉదయం 11.30 గంటలకు వాయిదాపడగా.. లోక్‌సభలోనే అదే పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ సభను ఉదయం 11.40 గంటలకు వరకు వాయిదా వేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని ఆ పార్టీ సభ్యులు మండిపోడున్నారు.
మరోవైపు పార్లమెంటు పనిచేయకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు నడువకపోవడం బాధ కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. దీంతో పార్లమెంటులో వస్తుసేవల పన్ను బిల్లుతోపాటు పేదలకు మేలు చేసే పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల పేదలకు నష్టం వాటిల్లే అవకాశముందని మోదీ పేర్కొన్నారు. ఏ ఒక్కరి ఇష్టాయిష్టాల మేరకు ప్రజాస్వామ్యం పనిచేయబోదని ఆయన కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.