
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభ సమావేశాలకు, చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. లోక్ సభ, రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీలు చర్చ చేపట్టాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు.
ఆగస్టు 10వ తేదీ వరకు మొత్తం 24 రోజుల్లో 18 పని దినాలపాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ కాకుండా వివిధ అంశాలపై చర్చకు 62 గంటల సమయం కేటాయించారు. ఈసారి 46 బిల్లులను చర్చకు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే విపక్షాలను కోరిన విషయం తెలిసిందే.