ప్రసూతి సెలవులు 26 వారాలు
కనీసం పది మంది పనిచేస్తున్న సంస్థల్లో అమలు
► అద్దె గర్భం, దత్తత ద్వారా తల్లులయ్యే మహిళలకు 12 వారాలు
► ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు–2016కు పార్లమెంట్ ఆమోదం
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల చెల్లింపు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది. కనీసం 10 మంది పనిచేస్తున్న సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలుచేయాల్సి ఉంటుంది. అయితే 26 వారాల ప్రసూతి సెలవులను ఒక మహిళకు తొలి రెండు కాన్పులకే పరిమితం చేశారు. మూడో కాన్పుకు 12 వారాలే ఇస్తారు. ఇది వరకే రాజ్యసభ ఆమోదించిన ప్రసూతి ప్రయోజనాల బిల్లు(సవరణ) – 2016ను లోక్‌సభలో కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఒకరోజు తరువాత ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం చారిత్రకమని, మహిళలకు ఇది తాను వినయపూర్వకంగా ఇస్తున్న కానుక అని ఆయన పేర్కొన్నారు. బిల్లులో చేసిన సవరణలు ప్రగతిశీలమైనవని, మహిళల కుటుంబం–పని మధ్య సమతూకం తెస్తాయని అభిప్రాయపడ్డారు. దీంతో మరింత మంది మహిళలు సంఘటిత రంగ మానవ వనరుల్లో భాగమవుతారని తెలిపారు.
అలాగే అసంఘటిత రంగ మహిళా కార్మికుల కోసం కేంద్రం ఇప్పటికే పలు సంక్షేమ చర్యలు చేపట్టిందని సభకు వెల్లడించారు. ఈ బిల్లుపై 4 గంటల పాటు జరిగిన చర్చలో ... తండ్రులకు కూడా ప్రయోజనాలు కల్పించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేశారు. ప్రసూతి సెలవుల పరంగా కెనడా (50 వారాలు), నార్వే (44 వారాలు)తరువాత భారత్ (26 వారాలు) మూడో స్థానంలో నిలవనుంది.
బిల్లులో పొందుపరిచిన ఇతర అంశాలు..
♦ చట్ట ప్రకారం మూడు నెలల కన్నా తక్కువ వయసున్న చిన్నారిని దత్తత తీసుకునే, అద్దె గర్భం ద్వారా తల్లయ్యే మహిళలకు 12 వారాల ప్రసూతి సెలవులు ఇస్తారు.
♦ కనీసం 50 మంది పనిచేస్తున్న సంస్థలు నిర్ధారిత దూరంలో పిల్లల సంరక్షణ కేంద్రాన్ని (క్రెచ్) ఏర్పాటుచేయాలి. తల్లి రోజులో 4 సార్లు అక్కడికి వెళ్లేందుకు అనుమతించాలి.
♦ వీలైతే ఉద్యోగిని ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించాలి. సెలవులు ముగిశాక ఉద్యోగిని, యాజమాన్యం పరస్పర ఆమోదంతో ఇలా ఎంత కాలమైనా పనిచేయడానికి అవకాశమివ్వాలి.
♦ ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌లు)లో పనిచేస్తున్న మహిళలకూ ఈ ప్రయోజనాలన్నింటినీ కల్పించాలి. పనిచేసే చోట లింగ సమానత్వం తీసుకురావడానికి ఉన్న అవకాశాన్ని ప్రసూతి సెలవుల బిల్లు వృథా చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. తండ్రులకు కూడా ప్రయోజనాలు కల్పించకపోవడాన్ని తప్పుపట్టింది.