లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు 13 రోజులపాటు జరగనున్నాయి. భూసేకరణ చట్టం - 2013కు సవరణలు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన రూపొందించిన ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ యెమెన్‌లో నెలకొన్న సంక్షోభం, అక్కడి భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు, విజయాలను వివరిస్తారు.
నెల రోజుల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ సమావేశాల్లో ముందుగా సంతాప తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టారు. ఇటీవల మరణించిన సింగపూర్ ప్రధాని లీ కువాన్ యూ , మాజీ లోక్‌సభ సభ్యులు ఇరువురు మృతిపై సభ సంతాపం తెలిపింది. ఈ సమావేశాల్లో రైల్వే పద్దులతో పాటు సాధారణ బడ్జెట్‌లో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగనుంది.
కాగా రాజ్యసభ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. ఈపార్లమెంటు సమావేశాలు వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మరోవైపు వెంకయ్యనాయుడు వివిధ బిల్లుల ఆమోదం, రాజ్యసభలో ప్రతిపక్షాల ఆధిపత్యం నేపధ్యంలో సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ ఎంపీలను కోరారు. లోక్‌సభ సమావేశాలు మే 8న, రాజ్యసభ సమావేశాలు మే 13న ముగియనున్నాయి.