‘కోర్టుతోనే రామమందిరం.. మోదీ సునామీ’
పాట్నా: ఆయోధ్యలోని రామమందిర నిర్మాణ అంశం చట్టపరంగా పరిష్కారం కావాల్సిందేనని కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ‘కోర్టు తీర్పు ద్వారా మాత్రమే ఆయోధ్య సమస్య పరిష్కారం కావాలి’ అని ఆయన ఆదివారం విలేకరులతో చెప్పారు. రామమందిరం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని నిబంధన 370వంటి అంశాలను కూడా ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌తోసహా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఓట్లకోసం ఆలోచించి మోదీ కూడా ఈ అంశాలను ప్రస్తావించలేదని, దానికి బదులుగా అభివృద్ధి, అవినీతి నిర్మూలనవంటివాటినే ప్రస్తావించారని చెప్పారు. పేద ప్రజల శక్తియుక్తులను మరింత పటిష్టం చేసేందుకు మోదీ నడుంకట్టారని అన్నారు. అభివృద్ధిని సాధించుకుంటూ అవినీతిని అంతమొందిస్తూ మోదీ చూపించిన మార్గంలోనే యోగి ఆదిత్యనాథ్ వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మోదీ సునామీతో ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు.