'ప్రస్తుతానికి భారత్తో శాంతి ప్రక్రియ లేదు'
న్యూ ఢిల్లీ: ఇటీవలి కాలంలో పట్టాలెక్కినట్లు కనిపించిన భారత్-పాక్ శాంతి ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్లోని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ గురువారం మాట్లాడుతూ.. భారత్తో శాంతి ప్రక్రియను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకానికి కారణం కాశ్మీర్ అంశమే అని ఆయన స్పష్టం చేశారు. బెలుచిస్తాన్ ప్రాంతంలో ఇటీవల అరెస్టైన కుల్బుషన్ యాదవ్ అంశాన్ని సైతం బాసిత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కుల్బుషన్ను మరోమారు భారత గూఢచారిగా ఆయన పేర్కొన్నారు.
భారత్తో పూర్తి స్థాయిలో సహజమైన, శాంతియుతమైన సంబంధాన్ని పాక్ కోరుకుంటోందని తెలిపిన బాసిత్.. ఇస్లామాబాద్లో జరగనున్న సార్క్ సదస్సు ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. పాక్ బృందాన్ని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు అనుమతించి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వానికి 'పాక్ యూటర్న్' మరో ఎదురుదెబ్బ కానుంది.