
మందుబాబులకు ఇదొక వింత ఫైన్
సాధారణంగా మద్యపానం వినియోగాన్ని తగ్గించేందుకు చట్టాలు కఠినతరం చేస్తారు. పరిమితులు విధిస్తారు. వాటిని అతిక్రమిస్తే జైలులో పడేస్తారు.
రాయ్పూర్: సాధారణంగా మద్యపానం వినియోగాన్ని తగ్గించేందుకు చట్టాలు కఠినతరం చేస్తారు. పరిమితులు విధిస్తారు. వాటిని అతిక్రమిస్తే జైలులో పడేస్తారు. కానీ, చత్తీస్ గఢ్లోని కోర్బా జిల్లాలోగల ఓ గిరిజన గ్రామంలో మాత్రం ఓ వింత నిబంధన పెట్టారు. ఎవరైనా మద్యం నిషేధాన్ని అతిక్రమించి మద్యం సేవిస్తే వారు ఒక కొబ్బరి కాయ జరిమానగా తిరిగి చెల్లించాలంట. మైంగాడి అనే గ్రామంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు పలువురు మద్యానికి బానిసలయ్యారంట. వారితో మద్యం మాన్పించేందుకు ఆలోచన చేసిన పంచాయతీ సర్పంచ్ శనిచరణ్ మింజ్ ఈ రకమైన ఫైన్ వేశారు.
అయితే, కొబ్బరికాయ సమర్పించుకోవడమంటే ఏదో పంచాయతీకి ఇచ్చి వెళ్లడం కాదు. అందరూ ఉండగా బహిరంగంగా దానిని తీసుకొచ్చి పంచాయతీ పెద్ద చేతిలో పెట్టాలంట. ఇలా చేయడం ద్వారా నలుగురి వారికి అవమానంగా అనిపించి మందు మానేస్తారని ఆ పెద్ద మనిషి ఆలోచన. ఒకసారి తప్పు చేసిన వారు మరోసారి అదే తప్పు చేస్తే మాత్రం నేరుగా పోలీసుల వద్దకు పంపింస్తారని నిబంధన పెట్టారు. వాస్తవానికి ఈ గ్రామంలో విద్యుత్ లేదంట.. వినోద కార్యక్రమాలు లేవంట. ఈ కారణం వల్లే వారంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ మద్యం సేవిస్తారని ఆ సర్పంచ్ చెప్పారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారు మారకపోవడం వల్లే తాజాగా ఈ నిబంధన తెచ్చినట్లు తెలిపారు.