
'ఆయన తొలి ప్రధాని అయ్యుంటే బాగుండేది'
న్యూఢిల్లీ : సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశ తొలి ప్రధాని అయి ఉంటే బాగుండని దేశ ప్రజలు భావిస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ పటేల్ 141వ జయంతి సందర్భంగా తన శాఖ అధికారులు, సిబ్బందితో వెంకయ్య సోమవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ నిర్మాణంలో వల్లభాయ్ పటేల్ వంటి నేతలు చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సి ఉందన్నారు. దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న గొప్ప నాయకులైన పటేల్, సుభాష్ చంద్రబోస్, బీఆర్ అంబేద్కర్, పండిత్ ధ్యాన్ దయాళ్ ఉపాధ్యాయ తదితరులకు జీవించి ఉన్నకాలంలో సముచిత గౌరవం దక్కలేదన్నారు. వారి కృషిని, ఔచిత్యాన్ని దేశ ప్రజలు స్మరించుకోవాల్సి ఉందన్నారు.
పటేల్ ఒక్కడే ప్రయత్నం చేసి దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టి, అన్ని సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసి దేశ ఐకమత్యాన్ని నిలబెట్టిన మహానాయకుడని వెంకయ్య ప్రశంసించారు. స్వతంత్రం అనంతరం ఆయన మూడేళ్లే జీవించి ఉన్నారని, ఎక్కువ కాలం ఉండి ఉంటే దేశం ఈ రోజు ఎదుర్కొంటున్న సవాళ్లు ఉత్పన్నమయ్యేవి కావని అభిప్రాయపడ్డారు.
దేశ ముఖచిత్రమే మరోరకంగా ఉండేదని, పటేల్ దేశ తొలి ప్రధాని అయి ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడమే ఆయనకు అర్పించే నివాళి అని, ఆశ్రిత పక్ష పాతానికి, వారసత్వ రాజకీయాలకు చోటివ్వకుండా వ్యవహరించారన్నారు. అనంతరం వెంకయ్య..ఉద్యోగులతో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.