గాంధీ, పటేల్ కాంగ్రెస్ సొంతం కాదు: నరేంద్రమోడీ | Narendra modi takes on congress party in Meeting | Sakshi
Sakshi News home page

గాంధీ, పటేల్ కాంగ్రెస్ సొంతం కాదు: నరేంద్రమోడీ

Published Mon, Aug 12 2013 1:59 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

గాంధీ, పటేల్ కాంగ్రెస్ సొంతం కాదు: నరేంద్రమోడీ - Sakshi

గాంధీ, పటేల్ కాంగ్రెస్ సొంతం కాదు: నరేంద్రమోడీ

సాక్షి, హైదరాబాద్: ‘‘మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు ఎవరికీ సొంతం కాదు. వాళ్లు కాంగ్రెస్ సొంత మనుషులెలా అవుతారు? దేశంలోని ప్రతి మనిషికీ సొంతమవుతారు. వాళ్లు యుగపురుషులు. విశ్వ సంపద’’ అని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సారథి నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఉక్కుమనిషి సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేసిన పటేల్ గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో అహ్మదాబాద్‌లో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
 
 అది అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా రెట్టింపు సైజులో ఉంటుందన్నారు. అక్టోబర్ 21న పనులు ప్రారంభించి నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. పటేల్ లేకుంటే హైదరాబాద్ ఏమై ఉండేదోనని మోడీ అన్నారు. ‘‘హైదరాబాద్‌తో సహా వందలాది సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు పటేల్ కృషి చేశారు. తొలి ప్రధాని నెహ్రూ మాత్రం ఒక్క సంస్థానాన్ని కూడా విలీనం చేయలేకపోయారు. కాశ్మీర్‌ను విలీనం చేసే బాధ్యతలను తీసుకున్న నెహ్రూ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించలేకపోయారు.
 
 ఇప్పుడక్కడి పరిస్థితేమిటో అందరికీ తెలుసు. పటేల్ విగ్రహ ఏర్పాటుకు వేల కోట్లు అవసరమా అని కొందరంటున్నారు. పారిస్‌లో ఈఫిల్ టవర్ కట్టినప్పుడు కూడా ఇదే విమర్శ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా వెళ్లి అక్కడ సేదదీరుతోంది. పటేల్ విగ్రహం నిర్మించిన తర్వాత కూడా ప్రపంచమంతా అక్కడకు రావాల్సిందే. ఆయన గురించి తెలుసుకోవాల్సిందే’’ అని మోడీ అన్నారు. పటేల్ విగ్రహ నిర్మాణంలో దేశంలోని ఏడు లక్షల గ్రామాలూ భాగస్వాములు కావాలని కోరారు. విగ్రహం కోసం రైతుల నాగళ్ల నుంచి తీసిన ఇనుమును భిక్ష అడుగుతున్నానన్నారు. కనీసం ఒకో గ్రామం 100 గ్రాముల ఇనుమయినా ఇవ్వాలని అభ్యర్థించారు. ‘యుగ పురుషులకు అత్యుత్తమ శ్రద్ధాంజలి ఘటించినప్పుడే వారి గొప్పదనం అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ నాయకుడికి అలాంటి శ్రద్ధాంజలి లభిస్తుందా అని బాగా ఆలోచిస్తే, అది పటేల్‌కు మాత్రమేనని అర్థమైంది. ఎందుకంటే ఆయన మన నుంచి దూరమై దశాబ్దాలు గడిచినా, ‘పటేల్ ఉండుంటేనా’ అని ఇప్పుడు కూడా ప్రజలు అనుకుంటుంటారు. దేశం సమస్యల్లో ఉన్నప్పుడల్లా ప్రజలకు పటేల్ గుర్తుకొస్తారు. ఇప్పటి 20, 25 ఏళ్ల యువకులు పటేల్‌ను చూడకపోవచ్చు.
 
 ఆయన గురించి వినకపోవచ్చు. కానీ వారు కూడా ‘పటేల్ ఉంటే ఎలా ఉండేదో, ఆయన దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే ఏమై ఉండేదో అని ఆలోచిస్తున్నారు. ఇంత కన్నా శ్రద్ధాంజలి ఏముంటుంది?’’ అని మోడీ అన్నారు. దేశంలో నగరాభివృద్ధికి బీజం వేసింది పటేలేనని, అహ్మదాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా 1930లోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. తనకు జన్మనిచ్చిన దేవుడు చిన్న చిన్న ఆలోచనలు చేసే మెదడు మాత్రం ఇవ్వలేదన్నారు. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ జె.నరసింహారావు, కార్యదర్శి టి.హరిహరశర్మ, డెరైక్టర్లు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 మోడీకి బాలయ్య శుభలేఖ
 సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం హైదరాబాద్‌లో గుజరాత్ సీఎం నరేంద్రమోడీని కలిసి ఈ నెల 21న జరగనున్న తన రెండో కుమార్తె తేజస్విని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. మోడీని కలిసిన ప్రముఖుల్లో దర్శకుడు కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు కుటుంబసభ్యులు, అల్లు అరవింద్, కీరవాణి, జగపతిబాబు, దిల్ రాజు, సి.కల్యాణ్, వి.వి.వినాయక్, బండ్ల గణేష్, డి.రామానాయుడు, డి.సురేశ్ బాబు, రానా, రాంగోపాల్‌వర్మ, కోట , పూరీ జగన్నాథ్, అలీ, కె.ఎల్.నారాయణ, సుమన్, గౌతమి, ఏవీఎస్, మురళీమోహన్ ఉన్నారు.
 
 ప్రముఖులతో భేటీ..
 కేర్ ఆసుపత్రి చైర్మన్ సోమరాజు, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, రిటైర్డ్ పోలీస్ అధికారి గోపీనాథ్‌రెడ్డి, ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు కుమారుడు సి.హెచ్ కిరణ్, హెచ్‌ఎంటీవీ సీఈవో రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ రాజం తదితరులతో పాటు పలు రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు మోడీతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సి.హెచ్.విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కృష్ణంరాజు తదితరులు కూడా హోటల్‌లో మోడీని కలిశారు. సాయంత్రం 3.45 గంటలకు మోడీ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement