యువతతోనే మార్పు
గ్రామీణాభివృద్ధిలో వారి భాగస్వామ్యం పెరగాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని, అప్పుడే మార్పు సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి సారథుల(పీఎంఆర్‌డీఎఫ్) పథకంలో పనిచేస్తున్న 230 మంది యువకులతో సోమవారమిక్కడ ఆయన సమావేశమయ్యారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పీఎంఆర్‌డీఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి గొప్పదని ప్రధాని కొనియాడారు.
పథకంలో భాగంగా తాము చేస్తున్న పనిని సిబ్బంది మోదీకి వివరించారు. గ్రామీణ, మారుమూల, గిరిజన, నక్సల్స్ ప్రభావ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులతో కలిసి మహిళా సాధికారత, మాత, శిశు సంరక్షణ, విద్య, పౌష్టికాహారం, స్వచ్ఛభారత్, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్, పాలనలో ప్రజల భాగస్వామ్యం తదితర కార్యక్రమాల్లో తాము చేస్తున్న కృషిని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, గ్రామీణ విద్య, గిరిజనాభివృద్ధి, సేంద్రియ సాగు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరును వివరించారు.
పీఎండీఆర్‌ఎఫ్ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అమలు చేస్తోంది. పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు పెంపు ఈ పథకం ఉద్దేశం. పథకం కింద ఎంపికైన యువతీ యువకులు జిల్లా అధికారులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు-వారి అవసరాలు-పాలన మధ్య ఉన్న అంతరాన్ని పూడుస్తూ, ప్రభుత్వానికి జనానికి మధ్య వారు(ఫెల్లోస్) వారధిలా ఉండాలి.