హక్కుల సంఘానికి 'పెప్పర్ స్ప్రే '
పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరిన లోక్‌సభ స్పీకర్
నేడు పార్లమెంటు భద్రతా కమిటీ అత్యవసర భేటీ
పార్లమెంటులోకి వెళ్లేముందు ఎంపీలను
తనిఖీ చేసే అంశంపై చర్చ!
న్యూఢిల్లీ: లోక్‌సభలో పెప్పర్ స్ప్రే(మిరియాల ద్రావకం) చల్లిన ఉదంతంపై స్పీకర్ మీరాకుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదివారం సభా హక్కుల కమిటీకి నివేదించారు. సభా వ్యవహారాలు, ప్రవర్తనా నియమావళిలోని 227 నిబంధన కింద ఆమె ఈమేరకు నివేదించారని లోక్‌సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో నేతృత్వంలోని 15 మంది సభ్యులు గల సభాహక్కుల కమిటీకి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిని శిక్షించే అధికారాలు ఉన్నాయి. జైలు శిక్ష విధించాలని, బహిష్కరించాలని సిఫార్సు చేయడం వంటివి అందులో ఉన్నాయి. గత గురువారం లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడం, ఇతరత్రా ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ భద్రతా కమిటీ భేటీ నిర్వహించాలని స్పీకర్ ఆదే శించడమూ విదితమే. పెప్పర్ స్ప్రే ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో భద్రతా కమిటీ సోమవారం అత్యవసరంగా భేటీ కానుంది. పార్లమెంటు ఆవరణలో జరగనున్న ఈ భేటీలో.. పార్లమెంటులోకి ప్రవేశించే సమయం లో ఎంపీలను తనిఖీ చేసే అంశంపై చర్చించే అవకాశముంది.
హక్కులకు కోత!
ఎంపీల ద్వారా సభలోకి ప్రమాదకరమైన, ప్రాణాలకు ముప్పు కలిగించే వస్తువులను తీసుకురాకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలతోసహా భద్రతకు సంబంధించిన సమస్త విషయాలను భద్రతా కమిటీ పరిశీలించనుంది. సభ్యులకున్న హక్కులను తగ్గించాలన్న డిమాండ్లను సైతం కమిటీ పరిశీలించేందుకు ఆస్కారమున్నట్టు సమాచారం. 2001 ఉగ్రవాద దాడి అనంతరం పార్లమెంటు భద్రతను పలు దఫాలుగా పటిష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. పెద్ద ఎత్తున పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. స్టేషనరీ మొదలుకుని తినుబండారాల వరకు ప్రతి ఒక్కదానినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. ఎంపీలను మాత్రం ఈ తనిఖీల నుంచి మినహాయించారు. అంతేగాక వారు మెటల్ డిటెక్టర్ల నుంచి కాకుండా విడిగా వెళ్లేం దుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే తాజా ఘటన తో ఎంపీలను సైతం తనిఖీ చేయాలన్న వాదన తలెత్తింది. ‘పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగాక అలాంటివి పునరావృతం కాకుం డా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అయితే కుటుంబ సభ్యుడే ఇంటికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తే ఎవరేం చేయగలరు?’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడొకరు అన్నారు.