న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే క్రమంలో అన్ని నియమ నిబంధనలనూ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కాయంటూ వామపక్షాలు దుయ్యబట్టాయి. ‘‘గురువారం సభలో జరిగిన సంఘటనలకు కేవలం మిరియాల ద్రావకం చల్లిన వారిని మాత్రమే బాధ్యులను చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలి. అవి సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోలేదు. నిజానికిదంతా ఉద్దేశపూర్వకంగా జరిగినదే. సభ సజావుగా సాగాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదనేందుకు ఇదే రుజువు’’ అని సీపీఎం లోక్‌సభా పక్షనేత బాసుదేవ్ ఆచార్య ఆరోపించారు. ఇలాంటి వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టే విషయమై కేంద్రం కేవలం బీజేపీతో మాత్రమే చర్చించింది తప్ప ఇతర విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదంటూ తప్పుబట్టారు.
తెలంగాణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టలేదన్నదే తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ బిల్లు అసలు సభ ఎజెండాలోనే లేదు. ఇది సభా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమే. పైగా బిల్లును ప్రవేశపెట్టినట్టుగా స్పీకర్ మీరాకుమార్ ప్రకటిస్తున్న సమయంలో, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ‘నేను బిల్లును ప్రవేశపెడుతున్నాను’ అని అనలేదు. అలా అనడం తప్పనిసరి’’ అని తొమ్మిదోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచార్య చెప్పారు. తమ హయాంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పూర్తి చేశామన్న బీజేపీ వాదనను సీపీఎం నేత సీతారాం ఏచూరి ఖండించారు. సభలో పూర్తి గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆ బిల్లులను ఆమోదింపజేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ వ్యాప్తి చేసేందుకు పార్లమెంటును వేదికగా కాంగ్రెస్ వాడుకుంటోందని సీపీఐ మండిపడింది. సాకులతో తెలంగాణ ఏర్పాటును వీలైనంత ఆలస్యం చేయడమే వారి లక్ష్యమని ఆరోపించింది.
నిబంధనలకు పాతర: లెఫ్ట్
Published Fri, Feb 14 2014 2:48 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement