ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులను ‘పనికిరాని’వారుగా నిర్ధారించి, విధుల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులను ‘పనికిరాని’వారుగా నిర్ధారించి, విధుల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మీడియాకు వెల్లడించింది. 2000 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏఎం జురీ, 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కేసీ అగర్వాల్‌ను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సూచనల మేరకు తొలగించారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ అనుమతి తర్వాత తొలగింపు ఉత్తర్వులను శనివారమే వెలువరించినట్లు అధికారులకు చెప్పారు.
15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన సందర్భంగా డీఐజీ ర్యాంక్ అధికారులైన ఈ ఇద్దరి పనితీరుపై సమీక్ష చేసి, ‘పనికిరాని’వారుగా తేల్చారు. 1983లో రాష్ట్ర పోలీస్ సర్వీస్‌లో చేరిన జురీ అనంతరం 2000లో ఐపీఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. ఇక 1985లో రాష్ట్ర పోలీస్ సర్వీస్‌లో చేరిన అగర్వాల్ 2002లో ఐపీఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. సర్వీస్‌లో చేరిన 15 ఏళ్ల తర్వాత ఒకసారి, 25 ఏళ్ల తర్వాత రెండోసారి.. ఇలా ఐపీఎస్‌ల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. గత జనవరిలోనూ ఇదే రాష్ట్రంలో మయాంక్ షీల్ చౌహన్, రాజ్‌కుమార్ దేవాంగన్‌లను కూడా విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.