కోర్టులో మాజీ భార్యపై కోపంతో ఊగుతూ..
అహ్మదాబాద్: విడిపోయిన భార్యకు ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఆమె కోర్టుకు ఎక్కడం విడిపోయిన భర్తకు తెగ చిరాకును తెప్పించింది. కోర్టులోనే ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని నాణెముల రూపంలో విసుగ్గా అందించి లెక్కపెట్టుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్లో పృధ్వీ ప్రజాపతి, రమీలాబెన్ అనే మహిళ భార్యాభర్తలు. వారు కొన్ని కారణాల వల్ల 2011 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య కోర్టును ఆశ్రయించింది.
తను బతికేందుకు ఖర్చుల నిమిత్తం కొంత చెల్లించాలని ఆమె కోర్టుకు విన్నవించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. పృథ్వీ నెలకు సంపాదిస్తున్న రూ.4వేలల్లో రూ.1500 ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. అయితే, తొలుత బాగానే చెల్లించిన అతడు 2014లో చెల్లించడం మానేశాడు. దీంతో ఆమె మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఫలితంగా అతడిని కోర్టు మరోసారి బోనులో నిలబెట్టడంతో ఆగ్రహానికి లోనైన అతడు రూ.10 వేలను ఓ బ్యాగులో నాణేల రూపంలో తీసుకొచ్చి ఆమెకు అందించి లెక్కపెట్టుకో అంటూ విసుగ్గా వెళ్లిపోయాడు.