సాక్షి, హైదరాబాద్: కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన యువతికి ఆన్‌లైన్ ట్యూటోరియల్ ప్రోగ్రాం ద్వారా అహ్మదాబాద్ వాసితో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అప్పటికే వివాహితుడైనప్పటికీ అతను ఆ విషయం దాచి సదరు యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె వెనక్కు వచ్చేయడంతో సైబర్ వేధింపులకు దిగాడు.
దీంతో అతడిపై హైదరాబాద్ సీసీఎస్‌తో పాటు అహ్మదాబాద్‌లోని వెజల్‌పూర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతగాడు అరెస్టులు తప్పించుకోవడానికి గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. రెండు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగరం నుంచి న్యాయమూర్తితో మాట్లాడిన యువతి అసలు విషయం వివరించింది.
నగరానికి వచ్చి యువతిని తీసుకెళ్లి..
అహ్మదాబాద్‌కు చెందిన ముసద్ధిఖ్ సోన్యావాలాకు (30) అతడి సోదరి నిర్వహించే ఆన్‌లైన్ ట్యుటోరియల్ ప్రోగ్రామ్ ద్వారా కిషన్‌బాగ్‌కు చెందిన యువతితో (18) పరిచయమైంది. ఆపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చాటింగ్ చేసుకున్న వీళ్లు ప్రేమికులయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చిన ముసద్ధిఖ్ ఆమెను తీసుకెళ్లి అహ్మదాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. యువతి అదృశ్యమైనట్లు భావించిన ఆమె తల్లిదండ్రులు గాలింపు చేపట్టి అసలు విషయం తెలుసుకున్నారు. స్థానిక పోలీసులతో కలిసి అహ్మదాబాద్ వెళ్లినప్పటికీ ఆమెను తమ వెంట తీసుకురాలేకపోయారు.
ఆమె వెనక్కు రావడంతో వేధింపులు...
ముసద్ధిఖ్ తనను రెండో పెళ్లి చేసుకున్నాడని యువతికి తెలిసింది. భార్యతో సన్నిహితంగా ఉండగా సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకోవడం అతడి బలహీనతగా గుర్తించింది. దీంతో విసుగు చెందిన ఆమె ఈ ఏడాది మార్చిలో తిరిగి వచ్చేసింది. విచక్షణ కోల్పోయిన ముసద్ధిఖ్ తన వద్ద ఉన్న ‘వీడియోలు’ లీక్ చేసి ఆమెను వేధించాడు.
యువతితో సన్నిహితంగా ఉండగా చిత్రీకరించిన 12 వీడియోలు, ఫొటోలను ఆమెకే పంపిస్తూ ‘సెక్స్ యాద్ రఖ్నా’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కంగుతిన్న బాధితురాలు మార్చిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ముసద్ధిఖ్‌పై కేసు నమోదైంది. అహ్మదాబాద్ వెళ్లిన యువతి కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అతడి సెల్‌ఫోన్‌ను వారి ఆధీనంలోకి చేర్చారు.
అక్కడి ఠాణాలో మరో ఫిర్యాదు...
బాధితురాలు అక్కడి వెజల్‌పూర్ ఠాణాలోనూ భర్త వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే నిందితుడు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అరెస్టు తప్పించుకోవడానికి ఇటీవల తన న్యాయవాది ద్వారా గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.
హైదరాబాద్ వెళ్లి కనిపించకుండా పోయిన తన భార్యను వెతికి అప్పగించాలని కోరాడు. దీంతో అహ్మదాబాద్ వెళ్లిన యువతి కుటుంబీకులు న్యాయవాది ద్వారా కౌంటర్ దాఖలు చేశారు. కేసును పక్కదారి పట్టించడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేయించాడని ఆరోపిస్తూ పూర్వాపరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
‘ఉగ్ర’ కోణమూ వెలుగులోకి...
గుజరాత్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన యువతి కుటుంబీకులు ‘ఉగ్ర కోణాన్నీ’ బయటపెట్టారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో పరారీలో ఉన్న ముఫ్తీ సూఫియాన్‌కు ముసద్ధిఖ్ సమీప బంధువని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా విదేశాల్లో తలదాచుకున్న సూఫియాన్ సహాయంతో ఇతగాడూ దేశం దాటిపోయే ప్రమాదం ఉందని, అలా జరగకుండా నిరోధించాలంటూ కోర్టును కోరారు.
అతడిపై ఉన్న కేసు విచారణ తప్పించుకోవడానికే హెబియస్ పిటిషన్ వేశాడని నివేదించారు. 2003 మార్చి 26న అహ్మదాబాద్‌లో జరిగిన హరేన్ పాండ్య హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. అప్పట్లో అక్కడి పోలీసులు నగరానికి వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
బాధితురాలి వాంగ్మూలం..
వెజల్‌పూర్ పోలీసులు సైతం హైకోర్టుకు సమాధానం ఇస్తూ నిందితుడి ఫోన్ నుంచి 3200 ఫైల్స్ కాపీ చేశామని, వీటిలో అత్యధికం తన భార్యలతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలేనంటూ నివేదించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఆ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ వసావను ఆదేశించింది.
రెండు రోజుల క్రితం నగరం నుంచి సదరు యువతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ హైకోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. ఇందులో తనకు జరిగిన అన్యాయాన్ని, వాస్తవాలను వివరించింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
(చదవండి: వెంబడించి లైంగిక దాడి.. చెప్తే చంపేస్తా.. భర్తకు ఆలస్యంగా తెలియడంతో)
Comments
Please login to add a commentAdd a comment