
బాంబు పేలుళ్ల నుంచి రాంచీని రక్షించిన ఫైలీన్ తుఫాన్
ఇటీవల వచ్చిన ఫై-లీన్ తుఫాన్ ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రకు అపార నష్టం కలిగించగా, జార్ఖండ్ రాజధాని రాంచీకి మాత్రం ఎంతో మేలు చేసింది. పెద్ద ఉపద్రవం నుంచి బయటపడేసింది. గత నెలలో దుర్గా పూజ సందర్భంగా రాంచీలో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జార్ఖండ్ పోలీసులు ఇటీవల రాంచీలోని ఓ లాడ్జిపై దాడి చేసి తొమ్మిది బాంబులు, 25 జిలెటిన్ స్టిక్స్, 14 డిటోనేటర్లు, 12 టైమర్లను స్వాధీనం చేసుకున్నారు.
దుర్గా పూజ సందర్భంగా రాంచీలో పేల్చేందుకు బాంబులను సిద్ధం చేసినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. సాధారణంగా ప్రజలు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అయితే గత నెలలో తుఫాన్ కారణంగా రాంచీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రాలేకపోయారు. దీంతో ఉగ్రవాదుల పన్నాగం విఫలమైంది. ఇండియన్ ముజాహిద్దీన్ జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. పాట్నా బాంబు పేలుళ్ల కేసులో రాంచీకి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.