బెంగళూర్ : కోవిడ్-19 ఆస్పత్రుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కర్ణాటకలోని ఓ కోవిడ్-19 ఆస్పత్రిలో పందులు స్వేచ్ఛగా తిరుగుతున్నా అక్కడున్న సిబ్బంది పట్టించుకోకుండా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కలబురగిలోని కోవిడ్ ఆస్పత్రిలో ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి బుధవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అప్పటినుంచి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ కర్గే స్పందిస్తూ ఆస్పత్రుల నిర్వహణ సవ్యంగా లేకపోవడంతో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఆస్పత్రిలో పందుల విహారంపై వీడియో వైరల్ కావడంతో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
కాగా దేశంలో తొలి కోవిడ్-19 మరణం కలబురగిలో చోటుచేసుకోవడం గమనార్హం. కరోనా కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో ఈ వ్యాధి నుంచి దేవుడే మనల్ని కాపాడాలని మంత్రి శ్రీరాములు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.. మనమంతా జాగ్రత్తగా ఉండాలి..మీరు పాలక పార్టీ సభ్యులైనా..విపక్ష సభ్యులైనా..సంపన్నులైనా..పేదలైనా..ఈ వైరస్‌కు ఎలాంటి వివక్ష ఉండద’ని శ్రీరాములు ఇటీవల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. శ్రీరాములు వ్యాఖ్యలపై విపక్ష కాంగ్రెస్ మండిపడింది. కోవిడ్-19ను ఎదుర్కోవడంలో యడ్యూరప్ప సర్కార్ సామర్ధ్యానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఇక గతంలో గుల్బర్గాగా పేరొందిన కలబురగిలో ఇప్పటివరకూ 2674 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment