వాసిం రిజ్వీ-జిలానీ (ఫైల్ ఫోటో)
లక్నో : షరియత్ కోర్టులు (దారుల్ కాజా) ఏర్పాటు చట్ట వ్యతిరేకమని యూపీ షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ పేర్కొన్నారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోని అన్ని జిల్లాలో షరియత్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వాసిం రిజ్వీ సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఉండొచ్చని, షరియత్ కోర్టులు మాత్రం ఏర్పాటు చేయాడానికి వీళ్లేదని వ్యాఖ్యానించారు. కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖ్వాసి (జడ్జి)లను నియమించడం సరికాదని అన్నారు.
ముస్లింల సమస్యలను పరిష్కరించడానికి సొంతంగా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది, ముస్లిం లా బోర్డు సభ్యుడు జాఫర్యాబ్ జిలానీ.. ప్రస్తుతం యూపీలో 40 కోర్టులు ఉన్నాయని అవి పూర్తిగా చట్టబద్దమైనవని స్పష్టం చేశారు. షరియత్ కోర్టులు చట్టవ్యతిరేకమైనవని ప్రజలు భావిస్తే సుప్రీంకోర్టు వాటిని తిరస్కరిస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కోర్టులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 15 బోర్డు సభ్యులందరూ సమావేశమై తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని జిలానీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment