న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ నేడు ప్రతిష్టాత్మక జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఈ పథకం దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
‘ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతారు. ఈ పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించే అవకాశాలున్నాయి’ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకంలో చేరేందుకు ఒడిశా విముఖత చూపగా, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఏ నిర్ణయం ప్రకటించలేదని చెప్పారు. 22 రాష్ట్రాలు ఈ పథకాన్ని ట్రస్ట్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
భద్రత కట్టుదిట్టం..
72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన కార్యక్రమం జరగనున్న ఎర్రకోట చుట్టూ 500 సీసీటీవీ కెమెరాలు, ఎన్‌ఎస్‌జీ బలగాలు, స్వాట్ కమాండోలతో పాటు సుమారు 10 వేల మంది పోలీసులతో భారీ రక్షణ వలయాన్ని ఏర్పాటుచేశారు.
గురువారం జేఎన్‌యూ విద్యార్థిపై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది నిఘా వర్గాలు ఎలాంటి హెచ్చరికలు జారీచేయకున్నా ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎర్రకోట సమీపంలోని హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్లు ఎగిరేయడంపై ఢిల్లీ వ్యాప్తంగా నిషేధం విధించారు.
గూగుల్, యూట్యూబ్‌లో లైవ్..
ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగాన్ని గూగుల్, యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ మేరకు గూగుల్‌లో ప్రసారభారతి ఒప్పందంచేసుకుంది. ఆగస్టు 15 కోసం సెర్చ్‌చేసినపుడు గూగుల్ హోంపేజీ పైభాగంలో లైవ్‌స్ట్రీమ్ ఆప్షన్ ఉంటుందని ప్రసారభారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కూడా ఇలాగే ప్రసారం చేశారు. ప్రధాని ప్రసంగం ఆకాశవాణిలో 20 వేర్వేరు భాషల్లో కూడా ప్రసారమవుతుంది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ రికార్డుచేసిన పాటతో వేడుకలు ప్రారంభమవుతాయి. తొలిసారిగా దూరదర్శిని వ్యాఖ్యతలు ఎర్రకోట నుంచే కార్యక్రమ విశేషాలు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment