సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. కేరళలో గురువారం జనరక్ష యాత్రలో పాల్గొనాల్సిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసకుని మరీ ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో అధికారిక కార్యక్రమంలో పాల్గొని తిరిగివచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
ఆర్థిక రంగం కుదేలైందన్న విపక్షాల విమర్శలను ప్రధాని తోసిపుచ్చిన క్రమంలో ఆర్థిక మంత్రి జైట్లీ, పార్టీ చీఫ్ అమిత్ షాలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కఠిన నిర్ణయాలకూ వెనుకాడమని కూడా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే.
దీంతో వృద్ధి రేటును గాడినపెట్టడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన వంటి అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక అంశాలతో పాటు త్వరలో జరగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలూ ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment