గిరిజనుల హక్కులను కాలరాయొద్దు
ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: గిరిజనుల జీవితాలను పణంగా పెట్టి అడవుల్లోని సహజసంపదను కొల్లగొట్టవద్దని ప్రధానిమోదీ కోరారు. వారి హక్కులను కాలరాసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారమిక్కడ తొలి జాతీయ గిరిజన ఉత్సవాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడారు. గిరిజనులు ఉంటున్న అడవుల్లోనే సహజ సంపద ఎక్కువగా ఉందని, అందువల్ల అభివృద్ధి కోసం వారి ప్రయోజనాలకు హానిచేసేలా ఖనిజసంపదను వెలికితీయొద్దని చెప్పారు. ‘ముడి ఇనుము, బొగ్గును వెలికితీయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికోసం గిరిజనుల హక్కులకు భంగం కలిగించొద్దు.
గతంలో బొగ్గు, ఇనుమును తవ్వితీసినప్పుడు వారి ప్రయోజనాల గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అయితే దీనిపై ఇప్పుడు సెస్‌ను వసూలు చేస్తున్నందువల్ల ఆ నిధులను మేము గిరిజనుల సంక్షేమానికి వాడుతున్నాం’ అని తెలిపారు. మైనింగ్‌తో పర్యావరణానికి విఘాతం కలగకుండా అత్యాధునిక పరిజ్ఞానం వాడడంపై దృష్టి పెట్టామన్నారు. గిరిజనులు తయారుచేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టార్టప్‌లు ముందుకురావాలని సూచించారు. ప్రజలు వీరి ఉత్పత్తులు కొనడం ప్రారంభిస్తే అది గిరిజనుల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందన్నారు.