అది ఫేర్ అండ్ లవ్లీ పథకం : రాహుల్ గాంధీ
ఝాన్సి: ప్రధాన మంత్రి ప్రకటించిన ఇన్ కమ్ డిక్లరేషన్ పథకాన్ని 'ఫేర్ అండ్ లవ్లీ' పథకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలోని ధనవంతులు తమ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు, మోదీ కి అనుకూలంగా ఉన్న పారిశ్రామిక వేత్తలకు లాభం చేకూర్చేందుకే ఈ ఇన్ కమ్ టాక్స్ డిక్లరేషన్ ను ప్రకటించారని రాహుల్ అన్నారు. ఎంత సేపు డబ్బున్న వారికే కాకుండా పేదవారు, రైతులకు మేలు చేసే పథకాలు ప్రవేశపెడితే బాగుంటుందని ప్రధానికి చురకలంటించారు.
తన 'కాట్ సభ' నుంచి కొంత మంది పేదవాళ్లు మంచాలను తీసుకెళితే వారిని దొంగలుగా చూస్తున్నారని, వేల కోట్లు ఎగ్గొట్టిన వారిని డీఫాల్డర్లుగా పిలుస్తున్నారని అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా బ్యారల్ పెట్రోల్ ధర 140 డాలర్లుగా ఉందని నేడు 40 డాలర్లేనన్నారు. అయినా ఎందుకు రేట్లు తగ్గించడంలేదని నిలదీశారు.