ఫెయిర్ అండ్ యమి
ఇంట్లో టీవీ పెడితే యమి గౌతమ్ కనిపిస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లేని రోజు ఉంటుందా? యమి ఆ క్రీమ్ పూసుకుని మెరిసే సౌందర్యవతి. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్‌గా మాత్రమే కాదు నటిగా కూడా ఆమె బాలీవుడ్లో పై వరుసలో ఉంది. ఈ అందమైన జీవితంలోనూ సవాళ్లు ఉంటాయి. ప్రశ్నలు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ యమి విజేతగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ఉదయం నాలుగ్గంటలకు యమి గౌతమ్ ఫోన్ మోగింది. చేసింది ఒక ప్రముఖ పత్రిక నుంచి జర్నలిస్ట్. ‘ఏంటి?’ అని అడిగింది యమి. ‘మీ మీద ట్రోలింగ్ జరుగుతోంది.. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని అడిగాడు జర్నలిస్ట్. అప్పటికి ట్రోలింగ్ అంటే ఏమిటో యమికి తెలియదు. ‘ట్రోలింగ్ అంటే?’ అని అడిగింది. ‘మిమ్మల్ని తిట్టి పోస్తున్నారు’ అన్నాడతను. ‘ఎందుకు?’ అని అడిగింది నెర్వస్‌గా. ఇంతలో ఫోన్ కట్ అయ్యింది.
అభయ్ డియోల్ బాలీవుడ్లో పేరున్న నటుడు. తన ఫేస్బుక్ పేజిలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘సినిమా తారలు అనవసరంగా కలరిజమ్ను ప్రచారం చేస్తున్నారు. తెల్లరంగే గొప్పది అనే ఈ ప్రచారం ఆ రంగు లేని వారందరినీ అవమానించే స్థాయిలో ఉంది. షారుక్‌ఖాన్, ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహమ్... వీళ్లంతా తెల్లగా చేసే క్రీములంటూ ఫెయిర్‌నెస్ క్రీములను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అని పోస్ట్ పెట్టాడు. ఈ వరుసలో యమి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఫెయిర్‌నెస్ క్రీముల్లో ఫెయిర్ అండ్ లవ్లీ అగ్రస్థానంలో ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ యమి.
దాంతో సోషల్ మీడియాలో యమి మీద విమర్శలు వెల్లువెత్తాయి. భిన్నమైన రంగులు ఉన్నవారిని న్యూనత పరిచే ఇటువంటి యాడ్స్‌లో నటించేవారికి కనీస ఆలోచన లేదని చాలామంది రాశారు. ఇలా జరుగుతుందని యమి ఊహించలేదు. దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఆ రోజంతా వెక్కివెక్కి ఏడుస్తూ కూచుంది. అసలు ఇందుకేనా ఈ రంగంలోకొచ్చింది?
∙∙
యమికి పుస్తకం తప్ప అద్దం తెలియదు. పుస్తకమే తన అద్దం అన్నట్టుగా ఎప్పుడూ అందులోనే తల దూర్చి ఉండేది చిన్నప్పుడు. వాళ్లది హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్. తండ్రి ముకేష్ గౌతమ్ చిన్నస్థాయి పంజాబీ సినిమాల దర్శకుడు. ఆయన పంజాబీ. తల్లి అంజలి గౌతమ్ హిమాచల్ కొండజాతి మూలాలున్న స్త్రీ. యమి గౌతమ్ బాల్యం బిలాస్పూర్లో గడిచినా హైస్కూల్, కాలేజ్ చండీగఢ్‌లోనే సాగాయి.
చిన్నప్పటి నుంచి చదువు మీదే ఆమె ధ్యాస. ఐ.ఏ.ఎస్ చేయాలనేది కల. స్కూలు సొంతదే అయినా ఆ స్కూల్లో ఆమె చాలా బిడియంగా తిరుగుతూ ఉండేది. నలుగురి ఎదుటకు రావడానికి చాలా సంకోచించేది. వాళ్ల తాతను ఇంప్రెస్ చేయడానికి ఒకసారి టీచర్లు యానివర్సరీ డేలో ఏదో కవిత చదివించాలని ప్రయత్నిస్తే యమి స్కూల్ వదిలి ఇంటికి పారిపోయింది. ఇలాంటి అమ్మాయిలకు చదువే కరెక్ట్ అని అనుకున్నారు అందరూ. కాని విధి వేరేగా ఆమె ప్రయాణాన్ని నిశ్చయించింది. అలా స్కూల్ వదిలి బిడియంతో పారిపోయిన అమ్మాయి ఇవాళ వందలాది మంది చూస్తూ ఉండగా కెమెరా ముందు డైలాగ్ చెప్పగలుగుతోంది. ఇది వింత కాకపోతే మరేమిటి?
∙∙
యమి లా డిగ్రీలో చేరింది. ఫైనలియర్లో ఉంది. ఆ రోజు ముంబైలో ఉండే బంధువులు చుట్టపు చూపుగా వాళ్లింటికి వచ్చారు. అందులో ఒకామె టీవీ రంగంలో పని చేసింది. ఆమె యమిని చూసిన మరుక్షణం నుంచి నువ్వు టీవీలో పనిచెయ్ టీవీలో పనిచెయ్ అని వెంటబడింది. ‘అమ్మా... ఏమిటి ఈ నస’ అని కిచెన్‌లోకి వచ్చి విసుక్కుంది యమి, తల్లితో. కాని ఆ వచ్చినామె వద్దన్నా యమి ఫొటో తీసుకుని ముంబై వెళ్లింది. ఆ తర్వాత తనకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్లన్నింటిలో చూపించింది. ఒక ప్రొడక్షన్ హౌస్ వారు యమి ఫొటోను చూసి ‘వెంటనే రమ్మనమనండి’ అని అన్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి.
వెళ్లాలా వద్దా. ‘ఏమో.. ట్రై చేయరాదూ’ అని తల్లిదండ్రులు అన్నారు. అలా తన 20వ ఏట యమి ముంబైలో అడుగుపెట్టింది. వెంటనే రెండు సీరియల్స్‌లో పాత్రలు దొరికాయి. ‘కలర్స్’ టీవీలో ప్రసారమైన ‘యే ప్యార్ నా హోగా కమ్’ సీరియల్‌తో యమి స్టార్ అయిపోయింది. ఆ వెంటనే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఆమెను తన మోడల్‌గా ఎంపిక చేసుకుంది. కన్నడ రంగం నుంచి తొలిగా ‘ఉల్లాస ఉత్సాహ’ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇది మన తెలుగు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’కు రీమేక్. హీరో కన్నడ స్టార్ గణేష్. అయితే ఆమెకు బాలీవుడ్లో పేరు రావాలి. అక్కడ హిట్ కావాలి. ‘వికీ డోనర్’ ఆ అవకాశం ఇచ్చింది.
దర్శకుడు సూజిత్ సర్కార్ హీరో జాన్ అబ్రహమ్ను వొప్పించి అతడు నిర్మాతగా ఒక చిన్న సిన్మాకు దర్శకత్వం వహించే చాన్స్ కొట్టాడు. కథాంశం కొత్తది. ప్రత్యుత్పత్తి కేంద్రాలకు ‘వీర్యాన్ని డొనేట్ చేస్తూ’ జీవించే కుర్రాడికథ అది. ఆ పాత్రకు కొత్తవాడైన ఆయుష్మాన్ ఖురానాను తీసుకున్నాడు. అతడి ప్రియురాలిగా యమి గౌతమ్‌ను తీసుకున్నాడు సూజిత్. ‘వికీ డోనర్’ పెద్ద హిట్. ఆ వెంటనే తెలుగులో అల్లుశిరీష్‌తో ‘గౌరవం’, తరుణ్‌తో ‘యుద్ధం’ సినిమాలు చేసింది యమి. అవి సరిగ్గా ఆడలేదు.
అజయ్ దేవగణ్‌తో చేసిన ‘యాక్షన్ జాక్సన్’ కూడా సత్ఫలితం ఇవ్వలేదు. కాని వరుణ్ ధావన్‌తో చేసిన ‘బద్లాపూర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే చాన్స్ వచ్చింది. ‘కాబిల్’ కూడా ప్రేక్షకులు హిట్ చేశారు. ఇటీవల ఆమె వికీ కౌశల్‌తో చేసిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్’, ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘బాలా’ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉరిలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, బాలాలో అమాయకమైన స్మాల్‌టౌన్ గర్ల్‌గా యమి తన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో ఎదిగిన నటి. స్టార్ పెర్ఫార్మర్. పెద్ద బేనర్లు, ఆమె చేస్తే బాగుండు అనుకునే స్క్రిప్ట్‌లు ఆమెకోసం వెయిట్ చేస్తున్నాయి.
∙∙
‘తెల్లరంగు గొప్పది, నల్లరంగు తక్కువది అనే భావన తప్పు. తెల్లరంగు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్లనే అందరూ అభిమానిస్తారు అని ప్రచారం చేయడం కూడా తప్పు. గతంలో ఆ ధోరణిలో యాడ్స్ వచ్చేవేమో. ఇప్పుడు మన సౌందర్యాన్ని మనం మరింత పెంచుకోవడం ఎలా అనే పాయింట్‌తో యాడ్స్ వస్తున్నాయి. అలాంటి యాడ్స్‌లో చేయడం తప్పు కాదు. నేను అలాంటి యాడ్స్‌నే చేస్తున్నానని గట్టిగా చెప్పగలను. అయినా నేను ఒక స్వతంత్రురాలిని. వేరొకరి ఆలోచనలు, భావధారను బట్టి నేను నా నిర్ణయాలను మార్చుకోను. ఏది సరైనదైతే అదే నేను చేస్తాను’ అని తన మీద వచ్చిన విమర్శలకు జవాబు ఇచ్చింది యమి ఆ తర్వాత.
∙∙
యమికి తన చెల్లెలు సురీలీ గౌతమ్‌తో, తమ్ముడు ఓజస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తనకు షూటింగ్ లేకపోతే వారితోనే సమయాన్ని గడుపుతుంది. ఆమెకు పోల్ డాన్స్ తెలుసు. ప్రొఫెషనల్‌గా ఆ డాన్స్‌ను నేర్చుకుంది. మనం అనుకునే రంగం వేరు కావచ్చు, ప్రవేశించే రంగం వేరు కావచ్చు... కాని ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గెలుపు అసాధ్యం కాదు అంటుంది యమి. ఆమె తమ బాహ్యసౌందర్యంతో పాటు మానసిక సౌందర్యాన్ని కూడా మెరుగు పెట్టుకుంటున్నదని ఆమె ఎదుగుదల, ఆలోచనలు, వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి. ఆమెను భవిష్యత్తులో మరింత అందంగా మనం చూడబోతున్నాం.
– సాక్షి ఫ్యామిలీ