న్యూఢిల్లీ/లక్నో: సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రూపొందించిన ‘‘ఆత్మనిర్భర్ ఉత్తర్‌ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’’ ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సంభాషించారు. ఈ క్రమంలో ముంబై, హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కూలీలు.. ఇకపై రాష్ట్రంలోనే ఉండి పనులు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ పథకం ద్వారా స్థానికంగా దాదాపు 1. 25 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని యూపీ అధికారులు వెల్లడించారు.
మరణాల సంఖ్య 90 శాతం తగ్గింది..
మహమ్మారి కోవిడ్-19పై పోరులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఒకప్పుడు ప్రపంచ దేశాలను జయించి, అతిపెద్ద శక్తులుగా అవతరించిన ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ తదితర యూరప్ దేశాల జనాభా మొత్తం కలిపి 24 కోట్లు. ఇది ఉత్తర ప్రదేశ్‌కు జనాభాకు సమానం. కోవిడ్-19 కారణంగా ఈ దేశాల్లో దాదాపు లక్షా ముప్పై వేల మంది మృత్యువాత పడగా.. యూపీలో కేవలం 600 కరోనా మరణాలు మాత్రమే సంభవించాయి. యూపీ సర్కారు మహమ్మారిపై పోరాడుతున్న తీరుకు ఇది నిదర్శనం’’ అని ప్రశంసించారు. అయితే భారత్‌లోనైనా.. ప్రపంచంలోని మరే ఇతర దేశాల్లోనైనా నివసిస్తున్న ప్రజలందరి ప్రాణాలు సమానమేనని.. కరోనాతో ప్రజలు మరణించడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు.(‘టెస్టింగ్ సామర్థ్యం మూడింతలు’)
అదే విధంగా ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని, భౌతిక దూరం తప్పక పాటించాలని ప్రజలక ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇక ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంపై దృష్టి సారించిన యోగి సర్కారు తీసుకుంటున్న చర్యల వలన అక్యూట్ ఎన్సెఫలిటిస్ సిండ్రోమ్(ఏఈఎస్- విపరీతమైన జ్వరం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం) పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గిందని.. మరణాల సంఖ్య కూడా 90 శాతానికి పడిపోయిందని హర్షం వ్యక్తం చేశారు.
కాగా లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన’ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో జూన్ 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 50వేల కోట్లతో ఆరు రాష్ట్రాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఇక ఈ పథకం కింద ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కూలీలకు రూ. 50 వేల కోట్లతో 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. ఇందులో పేదలకు గృహ నిర్మాణం, చెట్లు నాటడం, ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం, పంచాయతీ భవనాల నిర్మాణం, మార్కెట్లు, రోడ్ల నిర్మాణం తదితర 25 రకాల పనులు ఉంటాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో యూపీలో శుక్రవారం ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment