న్యూఢిల్లీ : ముస్లిం మహిళా హక్కులను కాపాడేందుకై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ చూపారని ఆయన ‘రాఖీ చెల్లెలు’ ఖమర్ మోహిసిన్ షేక్ అన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో తన అన్నయ్య మోదీ తప్ప మరెవరూ ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేరని ప్రశంసించారు. గురువారం రక్షా బంధన్ సందర్భంగా నరేంద్ర మోదీకి రాఖీ కట్టేందుకు ఆమె ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఖమర్ మాట్లాడుతూ...‘ ప్రతీ యేడు అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రానున్న ఐదేళ్లలో ఆయన ప్రపంచం గుర్తించే మరెన్నో గొప్ప, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నా. తక్షణ ముమ్మారు తలాక్ గురించి ఖురాన్, ఇస్లాంలో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ట్రిపుల్ తలాక్ విషయంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం హర్షించదగినది’ అని పేర్కొన్నారు.
కాగా పాకిస్తాన్ జాతీయురాలైన ఖమర్ పెళ్లి తర్వాత భారత్‌కు వచ్చేశారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్ననాటి నుంచి ఆయనకు ఖమర్ రాఖీ కడుతున్నారు. గత 20 ఏళ్లుగా ఈ ఆనవాయితీ క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. ఇక ఈరోజు కూడా ఆమె తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్లారు. అదే విధంగా తన భర్త వేసిన పెయింట్‌ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment