
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ ఘరానా జ్యూవెలర్ నీరవ్ మోదీని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. నీరవ్ తాను చేసిన పాపాలకు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. లలిత్ మోదీ, నీరవ్ మోదీలు తమ సిగ్గుమాలిన చర్యలతో దేశాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సి రూ 15,000 కోట్లు పైగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది.
మరోవైపు నీరవ్ మోదీ ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, మెహుల్ చోక్సీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 2011లో మొదలైన ఈ కుంభకోణాన్ని ఈ ఏడాది జనవరి మూడవ వారంలో గుర్తించారు. నీరవ్ మోసాన్ని గుర్తించిన పీఎన్‌బీ అధికారులు ఈ ఏడాది జనవరి 31న సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈడీ సైతం ఈ కేసుపై దర్యాప్తునకు రంగంలోకి దిగింది.