మోదీ ఎంఏలో ఫస్ట్ క్లాస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన విద్యార్హతలు ఏమిటి? అసలు ఆయన విద్యార్థిగా ఎలా ఉన్నారు. బాగా చదివారా.. నేటి విద్యార్థుల మాదిరిగా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్నారా? వంటి పలు అంశాలు తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవును.. ఆయన మోదీ విద్యకు సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయడంతో కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు శుక్రవారం అటు గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలకు ఆ సమాచారం తమకు అందించాలని ఆదేశించారు.
అయితే, ఆ వివరాలు బయటకు రాకముందే అహ్మదాబాద్ మిర్రర్ అనే పత్రిక ఆయన విద్యకు సంబంధించిన వివరాలు తెలిపింది. మోదీ ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఫస్ట్ క్లాస్ సాధించినట్లు వెల్లడించింది. మోదీ సగటు విద్యార్థికంటే మెరుగైన దశలో ఉండేవారని ఎంతో క్రమ శిక్షణతో నడుచుకునే వారని తెలిపింది. 1983లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన మోదీ.. 62.3శాతం మార్కులతో పట్టా పొందారని ఆయన యూరోపియన్ పాలిటిక్స్, ఇండియన్ పొలిటికల్ అనాలసిస్, సైకాలజీ ఆఫ్ పాలిటిక్స్ చదివారని చెప్పింది.
అయితే, మోదీ గ్రాడ్యుయేషన్ చెప్పకుండా.. విస్నగర్ లోని ఎంఎన్ సైన్స్ కాలేజీలో ప్రిసైన్స్ చదివినట్లు తెలిపింది. అంతేకాదు మోదీ ప్రి-సైన్స్ చదువుతున్న సమయంలో ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ ఆ సమయంలో ఇనార్గినిక్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేస్తున్నారట. వీరిద్దరి రోల్ నెం కూడా 71. గతంలో పలువురు వ్యక్తులు ఈ వివరాలు తెలపాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నా గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీలు ఆ వివరాలు తెలిపేందుకు నిరాకరించాయి.