ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర
విదేశీ విరాళాలపై ప్రశ్నించినందుకే ఆందోళనలు
♦ కొన్ని ఎన్జీవోలు, యూరియా కంపెనీల పనే
♦ ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
♦ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో పర్యటన
బార్‌గఢ్(ఒడిశా): విదేశీ విరాళాల లెక్కలు అడుగుతున్నందుకు అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న ఎన్జీవోలు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తులు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. తనను అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం ఒడిశాలోని బార్‌గఢ్‌లో జరిగిన రైతుల సభలో ప్రధాని ప్రసంగించారు. ‘చాయ్‌వాలా ప్రధాని అయ్యాడన్న వాస్తవాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారు’ అని మోదీ ఆరోపించారు.
గతంలో మాదిరిగా యూరియా అక్రమంగా రసాయన కర్మాగారాలకు దారిమళ్లకుండా చూసేందుకు దానికి వేప పూత పూస్తుండటంతో.. ఇన్నాళ్లూ యూరియాను లూటీ చేసిన కెమికల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు తనపై ఆగ్రహంగా ఉన్నాయన్నారు. విదేశీ విరాళాలు సేకరిస్తున్న ఎన్జీవోలను లెక్కలు సమర్పించాలని అడిగితే.. వారంతా కలిసి ఒక్కటై తనపై కక్ష గట్టారని మోదీ పేర్కొన్నారు. ‘వీరంతా కలసి ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారు. వీటికి నేను భయపడను. ప్రజలు ఇచ్చిన బాధ్యత నుంచి తప్పుకోను’ అని ఆయన తేల్చిచెప్పారు. ఎన్డీఏ సర్కారు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సాగు పథకం, పంటల బీమా పథకం, భూసార కార్డుల పథకం సహా మరికొన్ని పథకాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశం రెండో హరిత విప్లవాన్ని సష్టించగలదని విశ్వసిస్తోందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పంటల బీమా పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మోదీ కోరారు.
రూర్బన్ మిషన్ ప్రారంభం
దేశవ్యాప్తంగా 300 గ్రామీణ కేంద్రాలను (రూరల్ క్లస్టర్లు) పట్టణ సదుపాయాలతో కూడిన అభివృద్ధి కేంద్రాలుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్’ పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతమైన కురుభట్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా గ్రామీణ ప్రాంతాల పక్కనున్న పల్లెలూ అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామీణ స్ఫూర్తిని కొనసాగిస్తూనే గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యం, ఇంటర్నెట్ వంటి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం పేదలు, దళితులు, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పనిచేస్తోందని మోదీ చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం స్వచ్ఛ భారత్, రూర్బన్ మిషన్ వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. నయా రాయ్‌పూర్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ పేదల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోమ 2022 కల్లా పేదల కోసం ఐదుకోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
స్వాతంత్రోద్యమంలో భక్తి పాత్ర
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భక్తి ఉద్యమాల పాత్ర చాలా కీలకమని మోదీ కోల్‌కతాలో అన్నారు. గౌదియా మఠం శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించన మోదీ సమాజంలోని చెడును పారద్రోలటంలో శ్రీ చైతన్య, శ్రీ రవిశంకర్ దేవ్, తిరువళ్లువర్ పాత్ర మరువలేనిదన్నారు. అనంతరం మోదీ రాత్రి వారణాసికి చేరుకున్నారు. సోమవారం వారణాసితో పాటు బెనారస్ హిందూ వర్సిటీలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు.
మేకలమ్మి మరుగుదొడ్డి నిర్మాణం..ప్రధాని పాదాభివందనం
ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ప్రాంతమైన ధమ్‌తరాయ్ గ్రామానికి చెందిన కున్వర్ బాయి వయసు 104 ఏళ్లు. టీవీలు చూడదు.. పేపర్లు చదవదు. అయినా స్వచ్ఛభారత్ గురించి ఆమెకు చాలాబాగా తెలుసు. బహిరంగ కాలకృత్యాలు సాంఘిక దురాచారమని.. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలన్న కేంద్రం ఆలోచనను పాటించేందుకు.. కావాల్సినంత సొమ్ము లేదు. దీంతో.. ఉన్న రెండు మేకలను అమ్మి ఆ డబ్బుతో అనుకున్నది సాధించింది. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలో మరుగుదొడ్ల ఉద్యమం ఊపందుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా కున్వర్ బాయికి పాదాభివందనం చేసి ప్రత్యేకంగా అభినందించారు.
దత్తత గ్రామానికి చేనేత కళ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ దత్తత తీసుకున్న వారణాసిలోని జయపూర్ గ్రామానికి చేనేత కళ వచ్చింది. ఖాదీ పెలైట్ ప్రాజెక్టులో భాగంగా ఈ గ్రామంలో రాట్నాలు, మగ్గాలు దర్శనమిస్తున్నాయి. 35 మంది నిరుద్యోగ మహిళలు నూలు వడికి, వస్త్రాలు నేయటమెలాగో ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఇందుకు అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఎన్‌సీసీఎల్) 25 రాట్నాలు, 5 మగ్గాలు అందించినట్టు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) వెల్లడించింది. ప్రధాని పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈ గ్రామంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టామని, విజయవంతమైతే 200 రాట్నాలు, 50 మగ్గాలతో విస్తరించి 250 మంది మహిళలకు ప్రత్యక్షంగా, 50 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని కేవీఐసీ చైర్మన్ వీకే సక్సేనా చెప్పారు.