
కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై ప్రధాని ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ మ్యానిఫెస్టో అసత్యాల మయమని, అది మ్యానిఫెస్టో కాదని అవాస్తవాల పత్రమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తరహాలోనే వారి మ్యానిఫెస్టో సైతం అవినీతి, అబద్ధాలతో కూడుకున్నదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ బుధవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని పసీఘట్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలు అసత్య వాగ్దానాలు - అంకితభావానికి, విశ్వాసం - అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. ఈశాన్య భారతంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మీ సంస్కృతిని అవమానించిన వారు ఓవైపు ఉండగా, మీ సంస్కృతిని సొంతం చేసుకున్న మీ కాపలాదారుడిగా తానున్నానని అన్నారు. తూర్పు ఆసియా అంతటికీ ఈశాన్య భారత ముఖద్వారంగా అరుణాచల్ ప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని చెప్పారు. రైతులకు విత్తనం నుంచి మార్కెట్ వరకూ చేయూత ఇచ్చేలా పీఎం కిసాన్ పధకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.