ఉమాభారతి
న్యూఢిల్లీః పోలవరం ప్రాజెక్టును నిర్ధిష్ట సమయంలో పూర్తిచేస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు అయినందున తమకు పూర్తి బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం తాను స్వయంగా నీతిఆయోగ్కు వెళ్లి చర్చించానని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావాలని కోరుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటివరకు కేవలం 5 గ్రామాలకు మాత్రమే పునరావాస సహాయ చర్యలు చేపట్టారని, ప్రాజెక్టు సత్వర నిర్మాణం కోసం నిధులు భారీగా విడుదల చేయాలని కోరారు.
కొత్త చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఇప్పటికీ తమ తమ ఆవాసాల్లోనే ఉన్నందున వారందరికీ 1894 నాటి చట్టం ప్రకారం కాకుండా.. 2013 తరువాత వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ ఎ.సీతారాంనాయక్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని కోరారు. దీనికి ఉమాభారతి సమాధానమిస్తూ నిర్వాసితులకు మేలు చేకూర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం ఇదే అంశంపై ప్రశ్నిస్తూ కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు.