న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) బారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్య సిబ్బంది, పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ప్రాణాలు సైతం లెక్కచేయక ప్రజా సేవకే అంకితమవుతున్నారు. దీంతో ప్రజలంతా వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుతూ తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు. తాజాగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను సకాలంలో ఆస్పత్రికి తరలించిన పోలీసు సిబ్బంది.. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. ఢిల్లీలోని భట్‌కాలనీకి చెందిన గృహిణి నిర్మల ఏడు నెలల క్రితం గర్భం దాల్చారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమెకు నొప్పులు తీవ్రతరమయ్యాయి. దీంతో బర్దార్‌పూర్‌లోని ఓ క్లినిక్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహించగా గర్భంలోని బిడ్డ చనిపోయిన విషయం బయటపడింది. (కరోనా భయం: తమిళనాడులో అమానుషం)
ఈ క్రమంలో ఆపరేషన్ చేసి మృత శిశువును వెంటనే బయటకు తీయాలని.. వైద్యులు నిర్మల భర్తకు చెప్పారు. అయితే ఆపరేషన్ చేసేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జాకీర్ నగర్‌లో ఉన్న డాక్టర్ నహీదా ఫాతిమా దగ్గరకు వెళ్లాలని భావించారు. లాక్‌డౌన్ అమలవుతున్న తరుణంలో భార్యాభర్తలు సోమవారం ఆస్పత్రికి బయల్దేరారు. కానీ మార్గమధ్యలోనే నిర్మలా కళ్లు తిరిగి పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన జామియా పీఎస్ ఏఎస్‌ఐ సుభాష్ డాక్టర్ ఫాతిమాకు ఫోన్ చేసి వెంటనే క్లినిక్ తెరవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిర్మల, ఆమె భర్త నరేశ్‌ను ప్రైవేటు వాహనంలో అక్కడికి పంపించారు. నిర్మల పరిస్థితి అప్పటికే చేజారిపోవడంతో వెంటనే ఏసీపీకి సమాచారమిచ్చిన ఫాతిమా.. ఆపరేషన్ నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నారు. వెంటనే మృత శిశువును బయటకు తీసి నిర్మల ప్రాణాలు కాపాడారు.(రెస్టారెంట్ నుంచి గెంటేశారు: అంబులెన్స్ ఉద్యోగులు)
ఈ విషయం గురించి ఫాతిమా మాట్లాడుతూ.. జామియా పోలీసు స్టేషను అధికారులు గొప్పగా పనిచేశారని ప్రశంసించారు. ఇక నిర్మల భర్త నరేశ్ మాట్లాడుతూ.. ‘‘మా బేబీ మూడు రోజుల క్రితమే చనిపోయింది. తనే మొదటి బిడ్డ. నా భార్య పరిస్థితి విషమించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాలనుకున్నాం. అప్పుడు పోలీసులు మాకు సాయం చేశారు. డాక్టర్ నా భార్యకు ప్రాణం పోశారు. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన డాక్టర్, పోలీసులకు ధన్యవాదాలు’’అని ఉద్వేగానికి లోనయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment