వామ్మో.. మళ్లీ లాక్‌డౌనా? | May Impose Lockdown Again India Corona Cases Increase | Sakshi
Sakshi News home page

ఇంకోసారి లాక్‌డౌన్‌ అవసరమా? 

Published Sun, Nov 22 2020 8:07 AM | Last Updated on Sun, Nov 22 2020 4:07 PM

May Impose Lockdown Again India Corona Cases Increase - Sakshi

అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికాలో.. అంతకు ముందు నుంచే యూరోప్‌ దేశాల్లో.. దసరా, దీపావళి పండుగల తర్వాత భారత్‌లోనూ కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయన్నది వాస్తవం. ఢిల్లీలో గత 15 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండటం, దేశ రాజధానితోపాటు హరియాణా, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో మళ్లీ నియంత్రణలు మొదలు కావడం చూస్తుంటే కోవిడ్‌–19 సెకెండ్‌ వేవ్‌ మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ ఏడాది జనవరిలో మొదలైన కోవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతూ సెప్టెంబర్‌ 10 నాటికి రోజుకు 99,181 కేసుల స్థాయికి చేరింది. ఆ తర్వాత అక్టోబర్‌ చివరి వరకూ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. పతాకస్థాయిలో రోజుకు దాదాపు లక్ష వరకూ కేసులు నమోదు కాగా.. తర్వాతి కాలంలో సగానికి తగ్గిపోయాయి. ఇటీవలి కాలంలో వేర్వేరు ప్రాంతాల్లో కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నా.. దేశం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే 50 వేలకు కొంచెం అటు ఇటుగానే ఉండటం గమనార్హం.

గత బుధ, గురువారాల్లో సగటున 45,800 కేసులు నమోదయ్యాయి. మిగిలిన రోజులతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ. ఇంకోవైపు పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోవడం కేసుల సంఖ్యపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం దేశం మొత్తమ్మీద జరిగిన పరీక్షల సంఖ్య 7 లక్షల వరకూ ఉంటే.. మిగిలిన రోజుల్లో ఈ సంఖ్య సగటున 10 లక్షల వరకు ఉండటం గమనార్హం. అమెరికా, యూకేల్లోనూ కేసుల గ్రాఫ్‌ ఇదే తీరుగా ఉండటం చెప్పుకోవాల్సిన విషయం. అగ్రరాజ్యంలో కేసులు ఎక్కువ కావడం ఇప్పుడు మూడోసారి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో సెకెండ్‌ వేవ్‌ కూడా పతాకస్థాయికి చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా, ఇటలీల్లో సెకెండ్‌ వేవ్‌లో భాగంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా, రష్యాల్లో రెండు దశల పెరుగుదల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండగా.. యూకే, ఇటలీల్లో ఎక్కువగా ఉంది.  

ఇంకోసారి లాక్‌డౌన్‌ అవసరమా? 
యూరోపియన్‌ దేశాలు కొన్నింటిలో రెండో దఫా లాక్‌డౌన్‌ ఇప్పటికే మొదలైంది. భారత్‌లో కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉంది. దీంతో ఇక్కడ కూడా ఇంకోసారి లాక్‌డౌన్‌ విధించాలా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే కోవిడ్‌–19 కట్టడికి కొత్తగా నిబంధనలు పెడుతున్న రాష్ట్రాలు ఇప్పటివరకూ రెండో లాక్‌డౌన్‌ ఉండబోదనే చెబుతున్నాయి. సాంక్రమిక వ్యాధుల నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించడం కంటే మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా వ్యాధి ప్రబలకుండా అడ్డుకోవచ్చునని సూచిస్తున్నారు. దేశంలో యువజనం ఎక్కువగా ఉండటం వల్ల కోవిడ్‌ తో మరణిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, వీరి కారణంగా వృద్ధుల్లో నూ కొంతమేర వ్యాధి నిరోధకత ఏర్పడి ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో సెకెండ్‌ వేవ్‌ మొదలు కానుందని నవంబర్‌ 19న హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆయా ప్రభుత్వాలు నియంత్రణకు కచ్చితంగా వ్యక్తిగత, సామాజిక రక్షణ చర్యల అమలుపై దృష్టి పెట్టడం మేలని సూచించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. 

ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనలు... 
8 మాస్కు వేసుకోకపోయినా, కోవిడ్‌–19 నిబంధనలు అతిక్రమించినా రూ.5,000 వరకు జరిమానా 8 పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికే అనుమతి. 8 మార్కెట్లపై కఠినమైన నిఘా 
8 పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉండదని సీఎం కేజ్రీవాల్‌ స్పష్టీకరణ 
హరియాణాలో... : నవంబర్‌ 30వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌. మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఇటీవలే వీటిని పునఃప్రారంభించడంతో 174 మంది విద్యార్థులు, 107 మంది ఉపాధ్యాయులు కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో స్కూళ్లను మరోసారి తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. 
ముంబైలో..: బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని పాఠశాలలూ ఈ ఏడాది మొత్తం తెరుచుకోవు. ఈ అంశంపై నిర్ణయాన్ని స్థానిక సంస్థలకు వదిలేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. పాఠశాలల విషయంలో థానే కూడా ముంబై మార్గాన్నే ఎంచుకుంది. 
అహ్మదాబాద్‌లో..: 8 శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ. పాలు, మందులమ్మే దుకాణాలకు మాత్రమే అనుమతి.  
8 ప్రతిరోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ. 8 పాఠశాలలు, కాలేజీలు ముందుగా నిర్ణయించినట్లు నవంబర్‌ 23న ప్రారంభం కాకుండా తాజా ఆదేశాలు 8 గుజరాత్‌లోని రాజ్‌కోట్, సూరత్, వడోదరల్లో నవంబర్‌ 21 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధింపు  
ఇండోర్‌లో...: – నవంబర్‌ 21 నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ. అత్యవసర సేవల్లో ఉన్నవారు, ఫ్యాక్టరీ కార్మికులకు మాత్రమే మినహాయింపు. 8 మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, విదిశ, రత్లాంలలోనూ రాత్రిపూట కర్ఫ్యూ. 8 పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ఉండదని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పష్టీకరణ. 
రాజస్తాన్‌లో...: నవంబర్‌ 21 నుంచి రాజస్తాన్‌లోని అన్ని జిల్లాల్లో 144 సెక్షన్‌ విధింపు. 

హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందా? 
భారత్‌లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహించిన సెరో సర్వేల ద్వారా చాలామందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు స్పష్టమైంది. కొన్ని ప్రాంతాల్లో 60–70 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణేల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్‌–19 కారక వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇటీవలే కరోనా బారిన పడ్డవారు. కానీ హెర్డ్‌ ఇమ్యూనిటీకి అవసరమైన దాని కంటే ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు కలిగి ఉన్నారు. దీంతో తరచూ కరోనా వైరస్‌ల బారిన పడుతుండటం(కరోనా వైరస్‌ కుటుంబంలో దాదాపు 32 రకాలు ఉన్నాయి. జలుబుకు కారణమైన వైరస్‌ కూడా ఇదే కుటుంబానికి చెందినది. కోవిడ్‌–19 వ్యాధిని కలుగజేసే కరోనా వైరస్‌ మనుషుల్లోకి ప్రవేశించడం వల్లే సమస్య తీవ్రంగా ఉంది) వల్ల వాటి కోసం ఉత్పత్తి అయిన యాంటీబాడీలతో వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుండవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్‌ లాంటి పెద్ద దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం.. ఇతర ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా ఉండటం సహజమేనని, అయితే దేశం మొత్తమ్మీద ఏం జరుగుతోందన్నదే ముఖ్యమని వారు అంటున్నారు.

టీకా పరిస్థితి ఏమిటి?
కోవిడ్‌–19ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గం టీకా. ఇప్పటికే పలు కంపెనీలు టీకాలపై ప్రయోగాలు చేపట్టి చివరి దశకు చేరుకున్నాయి. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వంటి అంతర్జాతీయ ఫార్మా కంపెనీలతోపాటు భారత్‌ బయోటెక్, రష్యా, చైనాలు కూడా వేర్వేరు టీకాలను సిద్ధం చేశాయి. రష్యా, చైనాలు అత్యవసర పరిస్థితుల్లో కొంతమందిపై ఈ టీకాలను వినియోగించేందుకు అనుమతు లు కూడా ఇచ్చేశాయి. భారత్‌ విషయానికి వస్తే 2 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ప్రకటించారు. మరోవైపు భారత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ టీకాను తయారు చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌కు గానీ టీకా సిద్ధం కాదని చెబుతోంది.

మరో ఒకట్రెండు నెలల సమయం పడుతుంది. అంటే ఫిబ్రవరిలో బ్రిటన్‌లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇదే టీకాపై భారత్‌లోనూ మూడో దశ ప్రయోగాలు మొదలయ్యాయి.  మరోవైపు భారత్‌ బయోటెక్‌ టీకా కోవాగ్జిన్‌ మూడో దశ మానవ ప్రయోగాలు రెండ్రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇవి పూర్తయ్యేందుకు 56 రోజుల సమయం పడుతుందనుకుంటే వచ్చే ఏడాది జనవరి చివరికల్లా ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం ఉంది. మోడెర్నా, ఫైజర్‌ తదితర కంపెనీలు తయారు చేస్తున్న టీకాలను పరిగణనలోకి తీసుకోకపోయినా భారత్‌లో టీకా దొరికేందుకు కనీసం మార్చి తొలివారం వరకూ వేచి చూడక తప్పదన్నమాట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement