న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం మరో ముగ్గురు కోవిడ్–19 (కరోనా వైరస్) బారిన పడి చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరింది. బిహార్, గుజరాత్‌లో తొలి మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 360కి చేరినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 67 కరోనా కేసులను గుర్తించగా కేరళలో 52, ఢిల్లీలో 29 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన 17 రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్’కు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే బయటకు అనుమతిస్తారని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!)
వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు సంఘీభావంగా జనతా కర్ఫ్యూ సాయంత్రం చప్పట్లు కొడుతున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా
31 వరకు రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులు బంద్
కరోనా మహమ్మారి విస్తరించకుండా మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 22వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు బయల్దేరిన రైళ్లను మాత్రం గమ్యస్థానం చేరేందుకు అనుమతిస్తారు. ప్రయాణాలను రద్దు చేసుకునే వారికి డబ్బులు పూర్తిగా వెనక్కి చెల్లిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
► ఇటీవల కతార్ నుంచి తిరిగి వచ్చిన 38 ఏళ్ల కిడ్నీ బాధితుడు కరోనా లక్షణాలతో ఆదివారం చనిపోయినట్లు పట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. కరోనాతో ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా సూరత్‌లో 67 ఏళ్ల వృద్ధుడు కూడా దీని బారిన పడి మృత్యువాత పడ్డారు.
► యూపీలో 27, రాజస్తాన్‌లో 24, హరియాణాలో 21, కర్ణాటకలో 26 కరోనా కేసులు నమోదు కాగా పంజాబ్‌లో 21, గుజరాత్‌లో 18, లడఖ్‌లో 13 కేసులు గుర్తించారు. తమిళనాడులో ఆరు కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
► అనుమానితుల నమూనాలు పరీక్షించేందుకు ల్యాబ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌కు కేంద్రం ఆదేశించింది.
► జమ్మూ కశ్మీర్‌లోనూ ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌కు ఆదేశించారు.
► ఢిల్లీలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు లాక్‌డౌన్ ఆదేశిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, సమావేశాలు, ప్రజలు గుమిగూడటంపై నిషేధాజ్ఞలు విధించారు.
► సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మార్చి 27 వరకు కోల్‌కతాతోపాటు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది.
► పారా మిలటరీ బలగాల కదలికలపై కూడా నియంత్రణ విధించిన కేంద్రం ఏప్రిల్ 5 వరకు ఎక్కడి సిబ్బంది అక్కడే ఉండాలని ఆదేశించింది.
∙13,523 ప్యాసింజర్ రైళ్లు మార్చి 31 అర్ధరాత్రి వరకు రద్దయ్యాయి. కరోనా వైరస్ లక్షణాలు కలిగిన కొందరు వ్యక్తులు రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించినందున ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
► ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు నాగాలాండ్ తెలిపింది.
► మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్ల కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీని నిలిపివేయాలని నిర్ణయించాయి.
► ఫియట్ కంపెనీ కూడా ఈ నెలాఖరు వరకు తయారీని నిలిపివేసింది.
► హీరో మోటో కార్ప్, హోండా కూడా బైక్‌ల తయారీని నిలిపివేశాయి.
సుదీర్ఘ సంగ్రామానికి ఆరంభం: ప్రధాని మోదీ
కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలిపిన దేశ ప్రజలకు ధన్యవాదాలు
కరోనాపై దీర్ఘకాలిక యుద్ధానికి 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’ఆరంభం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం యావత్తూ ఏకమై ఏ సవాల్‌నైనా ఎదుర్కోగలమని రుజువు చేసిందని చెప్పారు. ‘జనతా కర్ఫ్యూ ఈరోజు రాత్రి 9 గంటలకు ముగియవచ్చు కానీ దీని అర్థం మనం సంబరాలు చేసుకోవాలని కాదు. స్వయం ప్రకటిత కర్ఫ్యూను విజయంగా భావించకూడదు. సుదీర్ఘ సంగ్రామానికి ఇది ఆరంభం మాత్రమే. గంటలు, వాయిద్యాలు మోగించడం ద్వారా కరోనాపై పోరాడుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన దేశ ప్రజలను అభినందిస్తున్నా’అని ట్విట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు.
అంతా ఇళ్లలోనే.. మార్మోగిన చప్పట్లు
ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’పాటించిన ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో బాల్కనీల వద్దకు చేరుకుని గంటలు మోగించి వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు. – ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్, బాంద్రా–వర్లీ సీ లింక్ జనతా కర్ఫ్యూతో జనసంచారం లేక బోసిపోయాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ), ఇతర సబర్బన్ రైల్వే స్టేషన్లు ఖాళీగా కనిపించాయి. గోవా చర్చి, ఇతర చోట్ల ఆదివారం ప్రార్థనలు రద్దయ్యాయి. కోల్‌కతాలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎస్ల్పనేడ్, డల్హౌసీ హౌస్ ఏరియా ప్రాంతాలతోపాటు ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు జనం లేక వెలవెలపోయాయి. గుజరాత్‌లోని ప్రధాన నగరాలు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లో చాలా స్పల్ప సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు.
పక్షుల కిలకిలా రావాలు వింటున్నారా?
జనతా కర్ఫ్యూ సందర్భంగా ట్విట్టర్ వినియోగదారులు..
న్యూఢిల్లీ: కొందరు ఇళ్లలో గరిటె తిప్పగా.. మరికొందరు ఉదయం నుంచే పుస్తకాలు చేత పట్టారు. ఇంకొందరైతే చెట్లపై నుంచి వినిపించే పక్షుల కిలకిలా రావాలు వింటూ గడిపారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా జనాలు ట్విట్టర్‌లో పంచుకున్న అనుభవాలివీ... ఎప్పుడూ రణగొణ ధ్వనులతో బిజీగా ఉండే ముంబై నగరానికి చెందిన ట్విట్టర్ యూజర్ వందన కుమార్ ‘ప్రకృతి పిలుపు’అని ట్వీట్ చేయగా.. రచయిత స్మిత బరూహ్ ‘నెమలి పిలుపుతో మేల్కొన్నా..’అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘నా ఇంటి పరిసరాల్లో ఒక్క వ్యక్తి కానీ, కారు కానీ కదలడం చూడలేదు. మీరు కోకిల ఇతర పక్షుల గొంతును వినగలుగుతున్నారా? నేను నెమలి పిలుపుతో మేల్కొన్నాను..’బరూహ్ పేర్కొన్నారు. పక్షుల కిలకిల రావాలకు సంబంధించి 6,400 ట్వీట్లతో ట్రెండింగ్ టాపిక్‌గా ‘బర్డ్’నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్మానుష్య రోడ్ల ఫొటోలు షేర్ చేస్తూ 3.4 లక్షల మంది ట్వీట్లతో ‘జనతా కర్ఫ్యూ’ట్రెండింగ్‌లో నిలిచింది.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు వెళ్లే పవర్ రైసినా హిల్ ప్రాంతం ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా నిర్మానుష్యంగా మారిన దృశ్యం.
ముంబైలోని చావల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లోకి వచ్చి సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న స్థానికులు
కరోనాకు మరో ముగ్గురి బలి
Published Mon, Mar 23 2020 4:12 AM | Last Updated on Mon, Mar 23 2020 8:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment