
రాజస్థాన్ లో శరవేగంగా రాజకీయ పరిణామాలు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహకరించారనే ఆరోపణలు తీవ్రం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజీనామా చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆమె కుటుంబానికి ఆప్త మిత్రుడు, క్యాబినెట్ మంత్రి రాజేంద్ర రాథోడ్ తో గురువారం ఉదయం వసుంధర భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ రోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో రాజేంద్ర రాధోడ్ సమావేశం కానున్నారు. వసుంధర సీఎంగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ బుధవారం ప్రకటించినా.. పరిస్థితులు మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
లలిత్‌మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి వసుంధర రాజే సహకరించినట్లుగా స్పష్టమైన ఆధారాలుండటంతో ఆమె వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ తీవ్రతరం చేసింది. రాజే సంతకంతో కూడిన రహస్య పత్రాలను ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారమిక్కడ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2011 ఆగస్టు 18వ తేదీతో ఉన్న ఆ పత్రాల్లో.. ‘ఇమిగ్రేషన్ కోసం లలిత్ పెట్టుకున్న దరఖాస్తుకు మద్దతుగా ఈ స్టేట్‌మెంట్ ఇస్తున్నాను. అయితే నా ఈ సహాయాన్ని భారత అధికారులెవరికీ వెల్లడించవద్దనే స్పష్టమైన షరతు మీద మాత్రమే..’ అని ఉంది. దీనికోసమే ఆమె తన లండన్ పర్యటనను మరికొంతం కాలం పొడిగించుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.