దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ వార్త తెలిసి శుక్రవారం పట్నాలో ఆనందంతో రంగులు పూసుకుంటున్న ప్రజలు
దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. సాహో తెలంగాణ పోలీస్ అంటూ జేజేలు పలుకుతున్నారు.. కానీ, రాజకీయ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌పై ఎవరి స్పందన ఎలా ఉందంటే..
హైదరాబాద్ పోలీసుల్ని చూసి ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం, కోర్టులు ఎంతైనా నేర్చుకోవాలి. నిర్భయ దోషుల్ని వెంటనే ఉరి తీయాలి. క్రూరాతి క్రూరమైన నేరానికి పాల్పడిన వారికి అలాంటి శిక్షలే పడాలి. తెలంగాణ పోలీసులు సరైన పనే చేశారు. మేము ఏడేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. దిశ తల్లిదండ్రులకు ఆ ఎదురుచూపులు తప్పాయి. వారి కడుపుకోత మాకు అర్థమవుతుంది. కనీసం వారికైనా సత్వర న్యాయం జరిగింది.
– నిర్భయ తల్లిదండ్రులు
ఒక సాధారణ పౌరురాలిగా ఈ ఎన్‌కౌంటర్‌పై ఆనందం వ్యక్తం చేస్తున్నా. ప్రజలంతా ఏ తీర్పు కోరుకున్నారో అదే జరిగింది. అయితే అది చట్టపరంగా న్యాయస్థానంలో జరిగి ఉండాల్సింది.
– రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు
హైదరాబాద్ ఎన్‌కౌంటర్ రేపిస్టులకు గట్టి సందేశాన్ని పంపింది. ప్రజలు న్యాయం జరిగిందనే అంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిర్భయల సంగతేంటి ? నేనైతే ఈ దేశం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను.
– స్వాతి మాలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్
హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ను ప్రజలందరూ హర్షిస్తున్నారు. మన దేశంలో క్రిమినల్ న్యాయవ్యవస్థపై ప్రజలకి నమ్మకం పోయింది. అది అత్యంత ప్రమాదకరమైన విషయం.
– కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
పోలీసులు ఆత్మరక్షణ కోసమే నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించడం వల్లే పోలీసులకు వారిని చంపక తప్పలేదు.
– యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ ఎవరూ దానిని చేతుల్లోకి తీసుకోకూడదు. హైదరాబాద్, ఉన్నావ్ అత్యాచార ఘటనలు దేశానికే సిగ్గు చేటు. బాధితుల గురించి ఆలోచిస్తే నా గుండె రగిలిపోతుంది. రేపిస్టులను శిక్షించడానికి చట్టాలను మరింత పకడ్బందీగా నిర్మించాలి.
–మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
అత్యాచార బాధితురాలికి సత్వర న్యాయం జరిగింది. ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే ఆలస్యంగానైనా ఏదో ఒకటి చేయడం మంచిది.
– జయా బచ్చన్, రాజ్యసభ ఎంపీ
హైదరాబాద్ ఎన్‌కౌంటర్ దేశానికి ఎంతో ప్రమాదకరమైనది. చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. విచారణ పూర్తవకుండా పోలీసులే నిందితుల్ని కాల్చి పారేస్తే ఇంక ఈ చట్టాలు, న్యాయవ్యవస్థ ఎందుకు ? కోర్టులే వారికి ఉరిశిక్ష వేసి ఉండవలసింది.
–మేనకా గాంధీ, బీజేపీ నేత
హైదరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలు అభినందనీయం. వారిని చూసి యూపీలో పోలీసు యంత్రాంగం స్ఫూర్తి పొందాలి. ఉత్తరప్రదేశ్‌లో ప్రతీరోజూ ప్రతీ జిల్లాలో ఏదో ఒక అత్యాచారం కేసు వెలుగులోకి వస్తోంది. యుక్తవయసులో ఉన్న వారిని, వయసు మీద పడిన వారిని ఏ మహిళనీ వదలడం లేదు. ఈ రాష్ట్రంలో గూండారాజ్యం నడుస్తోంది.
– మాయావతి, బీఎస్పీ అధినేత్రి
మహిళల భద్రతపై ఆందోళనలకు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమాధానం కాకూడదు. నిర్భయ చట్టాన్ని సరిగ్గా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?.
– సీతారాం ఏచూరి, సీపీఎం నేత
పోలీసుల చేతికి తుపాకులు ఇచ్చింది ఏదో ప్రదర్శన కోసం కాదు. నిందితులు పారిపోతుంటే వాడుకోవడానికి మాత్రమే.
–మీనాక్షి లేఖి, బీజేపీ ఎంపీ
పురుషుల నుంచి మహిళలు అధికారాన్ని లాక్కొని, తమకు ఎదురయ్యే ఘటనల నుంచి రక్షణ పొందాలి. మహిళలు పంచాయతీ, విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయాలి. రాజకీయాల్లోకి వచ్చి అధికారాన్ని పొందడం ద్వారా ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షించుకోవచ్చు. ‘ఉన్నావ్’ లాంటి ఘటనలు జరుగుతుంటే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుంది?
– ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment