కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం పతాక స్ధాయికి చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం నుంచి ర్యాలీలతో ప్రచారాన్ని వేడెక్కించనున్నారు. మోదీ సిలిగురిలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనుండగా,మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్‌లోని దిన్హాట నుంచి తొలి బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో ప్రధాని తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్న రోజే మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహిస్తుండటంతో పరస్పర విమర్శలతో ప్రచారం హోరెత్తుతుందని భావిస్తున్నారు. తొలుత ఈనెల 4 నుంచి తన ప్రచార సభలను నిర్వహించాలని షెడ్యూల్ ఖరారైనా తొలివిడత పోలింగ్ జరిగే కూచ్‌బెహర్ నియోజకవర్గ పరిధిలోని దిన్హాటలో ఒక రోజు ముందుగానే ప్రచార భేరి మోగించాలని నిర్ణయించారు. యూపీ, మహారాష్ట్ర తర్వాత 42 లోక్‌సభ స్ధానాలతో మూడవ అతిపెద్ద రాష్టం బెంగాల్‌లో సత్తా చాటాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, పట్టు నిలుపుకునేందుకు మమతా సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, ఉనికి నిలుపుకునేందుకు వామపక్షాలు చెమటోడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment