జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్లలో తుది దశ పోలింగ్
జమ్మూ కాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి అయిదవ, తుది దశ పోలింగ్ ప్రక్రియ శనివారం ఉదయం ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్: తుది దశలో 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి తారాచంద్తోపాటు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాశ్మీర్ లోయలో ఇంతకుముందు జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో భారీ ఓటింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. జమ్మూ, కుధువా, రాజౌరీ జిల్లాలో నేడు జరిగే పోలింగ్లో భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సాధారణ పోలీసులతోపాటు 400 కంపెనీల భద్రత సిబ్బందిని మోహరించారు. భారత్, పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
జార్ఖండ్: తుది దశలో ఆరు జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 208 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ... డుమ్కా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. అలాగే అసెంబ్లీ స్పీకర్తోపాటు మరో మంత్రి కూడా ఈ ఎన్నికల బరిలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో అయిదు విడతలుగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 23వ తేదీన లెక్కిస్తారు.