కాశ్మీర్, జార్ఖండ్ల్లో మూడో దశ ఎన్నికలు ప్రారంభం
జమ్మూకాశ్మీర్/ జార్ఖండ్: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల శాసనసభకు మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో సీఎం ఒమర్ అబ్దుల్లాతోపాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు బరిలో ఉన్నారు. బద్గామ్, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని 16 స్థానాలకు సంబంధించిన పోలీంగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లో మూడో దశ ఎన్నికల్లో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో నిలిచి... తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాశ్మీర్లోయలో శుక్రవారం ఉగ్రవాదులు దాడితో 21 మంది మృతి చెందిన నేపథ్యంలో ఎన్నికల జరిగే ప్రాంతాలలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. సీఎం ఒమర్ అబుల్లా గందర్ బాల్తోపాటు బీర్ వా స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు.
అలాగే జార్ఖండ్లో మూడో దశ ఎన్నికల్లో 17 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో మొత్తం 289 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 103 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీతోపాటు ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఎన్నికల బరిలో నిలిచారు.