త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో అన్నీ కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)నే వినియోగించనున్నారు
నెలాఖరుకల్లా సిద్ధంకాకుంటే ఆఖరి దశలోనే
బెంగళూరు భెల్, హైదరాబాద్ ఈసీఐఎల్‌లో తయారీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో అన్నీ కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల)నే వినియోగించనున్నారు. ఇందుకోసం మూడు లక్షలకు పైగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్), హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో తయారవుతున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తయితే తొలి దశ తనిఖీలు జరిగి, ఎన్నికల నాటికి ఈవీఎంలు సిద్ధంగా ఉంటాయని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. వాటితో 2009లో జరిగిన తరహాలోనే తొలి దశలో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుందని చెబుతున్నాయి. ఒకవేళ అవి నెలాఖరులోగా సిద్ధంగాకుంటే ఆఖరి దశల్లో పోలింగ్ ఉంటుందంటున్నాయి. 2006 సంవత్సరానికి ముందు తయారు చేసిన ఈవీఎంలను రాష్ట్రంలో ఇప్పటివరకు వినియోగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అన్నీ కొత్తవే ఉపయోగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు వినియోగించిన ఈవీఎంలన్నింటినీ ఇతర రాష్ట్రాలకు తరలించారు. ఈ కొత్త ఈవీఎంలపై ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (నోటా) గుర్తు కూడా ఉంటుంది. ఒక్కో ఈవీఎంపై 16 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా నోటా రావడంతో 15 మంది పేర్లు, గుర్తులకే అవకాశం ఉంటుంది.
వ్యయంపై నిఘాకు సిద్ధంగా ఉండండి: రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ముమ్మరం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. నాటి నుంచి అభ్యర్థులు, పార్టీల ఎన్నికల వ్యయంపై నిఘా పెట్టేందుకు మండల, నియోజకవర్గాల వారీగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాల్లో పోలీసు అధికారి, మండల అభివృద్ధి అధికారి, తహసిల్దారుతో పాటు ఒక వీడియోగ్రాఫర్ కూడా ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై బృందం సభ్యులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. గత ఎన్నికలకు సంబంధించిన నాన్‌బెయిబుల్ వారెంట్లను ఇప్పటినుంచే అమలుచేయాలని కూడా ఆదేశాల్లో స్పష్టం చేశారు.