రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి: ఎంపీ పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆపేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నా.. జూన్ 2న రాష్ట్రం అవతరించిన తరువాత ఐదు నెలల్లో దాదాపు 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
విద్యుత్తు, నీటి కొరత లాంటి అంశాలు అన్నదాతల బలవన్మరణాలకు దారితీశాయి. ఉన్న అప్పులు తీరక, కొత్త రుణాలు అందక రైతులు కుంగిపోయారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి రావడం కూడా రైతుల దైన్యస్థితికి కారణం. ఈ పరిస్థితిని జాతీయ వైపరీత్యంగా పరిగణించి వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించండి.. తక్షణం రైతులకు భరోసా ఇచ్చే చర్యలు చేపట్టండి..’ అని పేర్కొన్నారు.