ఎన్నికలపైనే దృష్టి
న్యూఢిల్లీ:జాతీయ రాజధాని శాసనసభ ఎన్నికల దిశగా సాగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకోసం ప్రజా తీర్పు కోరడం తప్ప మరో మార్గం లేదని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు బలంగా వాదిస్తున్నాయి. అయితే నాయకుల వాదన మాత్రం మరోవిధంగా ఉంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంతమాత్రం సన్నద్ధంగా లేరని, అందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. అయితే తాజా ఎన్నికలకు సంబంధించి కసరత్తు మాత్రం మొదలైందంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఎన్నికల విషయంలో అందరికంటే ముందుంది.
అందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే. ఈ విషయమై ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు విజేంద్ర గుప్తా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయ మార్గమన్నారు. విజేందర్ ఆలోచనలు ఇలా ఉంటే తాము ఇప్పుడప్పుడే ఎన్నికలకు ఎంతమాత్రం సన ్నద్ధంగా లేమంటూ ఆ పార్టీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి తాజా స్థితిగతులను వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఢి ల్లీలో రాష్ర్టపతి పాలన అమల్లోకి వచ్చిన సంగతి విదితమే.
రాష్ర్టంలో తాజా రాజకీయ స్థితిగతుల పై ఒకటి లేదా రెండు నెలల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఎన్నికల బాల్...లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టులోనే ఉంది. తదుపరి చర్య తీసుకునే విశేష అధికారం ఆయనకే ఉంది. ఆయన నివేదికను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికొచ్చే అవకాశముంది. ఎల్‌జీ నివేదిక అందిన తర్వాత రాష్ర్టపతి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించాలా లేక ఎన్నికలు నిర్వహించాలా అనే విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల సన్నద్ధతపై అధిష్టానానికి బీజేపీ రాష్ర్ట శాఖ ఇటీవల ఓ నివేదికను సమర్పించిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీకి చెందిన ఓ వర్గం ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించిందని, అయితే అధిష్టానం అందుకు నిరాకరించిందని తెలిపాయి.
ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యపడ లేదు.
ఈ విషయమై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ ఆప్‌కు మద్దతు ఇవ్వబోమన్నారు. ఆ విషయంలో మరో మాటే లేదన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించక తప్పదన్నారు. ఆప్‌కు మద్దతు ఇచ్చేందుకు తమ కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడే అవకాశముందంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇవన్నీ కట్టుకథలని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి వాటిని సృష్టిస్తున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకతాటిపై ఉన్నారని చెప్పారు. అందువల్ల ఆప్‌కు మద్దతు విషయంలో పునరాలోచించేదేమీ లేదన్నారు. కాగా తమ సంప్రదాయ ఓటుబ్యాంకును ఆప్ కొల్లగొట్టిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదిలాఉంచితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నానాతంటాలు పడుతోంది. ఇందులోభాగంగా నీరు, విద్యుత్ సమస్యలపై గత నాలుగు రోజులుగా ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంది.