
కరోనా వైరస్ విజృంభిస్తున్నా బిహార్‌లో రాజకీయాలపై చర్చ
పట్నా : కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తుంటే బిహార్ ముఖ్యమంత్రి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ప్రారంభించడాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. బిహార్‌లో అతితక్కువగా టెస్ట్‌లు చేస్తున్నా 6000కు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో కరోనా వైరస్ నియంత్రణను పక్కనపెట్టి బిహార్‌లో ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ భయాలతో ఇంటికే పరిమితమైన నితీష్ కుమార్ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వస్తే ప్రజలు మాత్రం వైరస్‌కు గురికారని ఆయన ఆలోచిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
కరోనా వైరస్‌పై బిహార్ ప్రభుత్వ తీరును ఆదివారం వరుస ట్వీట్లలో ఆయన తప్పుపట్టారు. ప్రశాంత్ కిషోర్ కొద్దికాలం జనతాదళ్ (యూ)లో పనిచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన తర్వాత నితీష్ కుమార్ ఇంతవరకూ మహమ్మారిపై ప్రజలను ఉద్దేశించి ఇంతవరకూ ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం విమర్శలకు తావిచ్చింది. మహమ్మారి విజృంభిస్తున్న వేళ నితీష్ ఇంతవరకూ మీడియా ముందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.