పాట్నా: సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్ధించడాన్ని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుబట్టారు. తేజస్వీ యాదవ్ పాఠశాలకు ఎప్పుడూ వెళ్లలేదని, కనీసం తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సెక్స్ ఎడ్యూకేషన్ పట్ల తేజస్వీ యాదవ్‌కు ఎలాంటి అవగాహన లేదని దుయ్యబట్టారు.
తేజస్వీ యాదవ్ ఏ పాఠశాలకు వెళ్లారో బయటకు వెళ్లడించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఎక్కడ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ను నేర్చుకున్నారో? బహిర్గతం చేయాలని కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినంత అసభ్యకరమైన భాషలో పాఠశాలల్లో లైంగిక విద్య బోధించరని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించిన తీరు ఆయనకు జ్ఞానం లేనివాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న తేజస్వీ యాదవ్.. నితీష్ వ్యాఖ్యలను సెక్స్ ఎడ్యుకేషన్‌గా పేర్కొంటూ.. పాఠశాలల్లో కూడా చర్చిస్తారని అన్నారు. అయితే.. బీజేపీ, మహిళా సంఘాల ఆందోళనలతో నితీష్ కుమార్ తన వ్యాఖ్యలపై ఎట్టకేలకు క్షమాపణలు కోరారు.
ఇదీ చదవండి: సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment