సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుపై చర్చ ఉండదని ప్రభుత్వం చేసిన ప్రకటన పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబికిన నిరసనలను చల్లార్చేందుకేనని జేడీ(యూ) నేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇది కేవలం విరామం మాత్రమే ఫుల్‌స్టాప్ కాదని ఆయన గురువారం ట్వీట్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు వెలువరించేవరకూ వేచిచూడాలని కోరారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా మొత్తం ప్రక్రియ మొదటికి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షం జేడీ(యూ) ఉపాధ‍్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ చట్టంపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీని డిమానిటైజేషన్ ఆఫ్ సిటిజన్‌షిప్‌గా ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై చర్చ ఉండబోదన్న ప్రధాని మోదీ ప్రకటనను వ్యూహాత్మక చర్యగా ప్రశాంత్ కిషోర్ అన్నారు. మరోవైపు ఎన్‌ఆర్‌సీలో గుర్తించిన ముస్లిమేతర అక్రమ వలసదారులను పౌర చట్టం రక్షిస్తుందని, పెద్దసంఖ్యలో ముస్లింలు దేశం వీడివెళ్లాల్సి వస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పౌరచట్టం, ఎన్‌ఆర్‌సీల ఫలితంగా ముస్లింలు దేశం నుంచి నిష్క్రమించేలా ప్రభావం చూపుతాయని మాజీ హోంమంత్రి పీ చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment