
సాక్షి, అహ్మదాబాద్: బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరుస్తుందని పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో బీజేపీకి 44.8 శాతం ఓట్లు పోలవుతాయని, కాంగ్రెస్‌కు 43.2 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులకు 12 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. బీజేపీకి కాంగ్రెస్‌తో పోలిస్తే కేవలం 1.6 శాతం ఓట్లే అధికంగా వస్తాయని ఈ పోల్ భావిస్తోంది. ఓట్ల శాతం అతితక్కువగా ఉండటంతో ఆయా పార్టీలకు వచ్చే సీట్ల సంఖ్య అంచనాలను ఈ సర్వే ప్రకటించలేదు.
పార్టీలకు సవాళ్లివే...
గుజరాత్‌లో బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారా అని అడగ్గా 45.9 శాతం మంది సానుకూలంగా స్పందించగా, కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తామని 44.1 శాతం మంది సర్వేలో చెప్పారు. ఇక్కడా ఓట్ల తేడా కేవలం 1.7 శాతం కావడం గమనార్హం. కాంగ్రెస్‌కు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేకపోవడం, బలమైన రాష్ట్ర నాయకత్వం కొరవడటం అవరోధాలుగా నిలిచాయి. రాహుల్ గాంధీపైనే ఆ పార్టీ అతిగా ఆధారపడటం కూడా లోపంగా పరిణమించింది. గ్రామీణ ప్రాంతాల మాదిరిగా పట్టణ ప్రాంతాలపై కాంగ్రెస్ దృష్టి సారించకపోవడం మైనస్‌గా మారిందని చెబుతున్నారు. ఇక 22 ఏళ్లుగా అధికారంలో ఉండటం బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ఎదురయ్యేందుకు కారణం కాగా, పటేళ్ల ఉద్యమం, జీఎస్‌టీ, నోట్ల రద్దు, దళితులపై దాడులు ప్రతికూలంగా మారాయి. పత్తి, వేరుశనగకు మద్దతు ధర లేకపోవడం రైతుల్లో బీజేపీ పట్ల వ్యతిరేకతను పెంచింది.
సీఎంపై వ్యతిరేకత
గుజరాత్‌లో బీజేపీ స్వల్ప ఆధిక్యం కనబరిచే అవకాశాలున్నా సీఎం విజయ్ రూపానీ పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పోల్‌లో వెల్లడైంది. విజయ్ రూపానీ పనితీరు బాగాలేదని ఏకంగా 59.2 శాతం మంది అభిప్రాయపడగా, పరవాలేదని 22 శాతం మంది, బాగుందని కేవలం 18.6 శాతం మంది ఓటర్లు చెప్పారు. తదుపరి సీఎంగా ఎవరి వైపు మొగ్గుచూపుతారంటే 22.9 శాతం మంది విజయ్ రూపానీకి సానుకూలంగా ఓటేశారు. తర్వాత కాంగ్రెస్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి వైపు 18.6 శాతం మంది మొగ్గుచూపారు. మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్‌కు కేవలం 6.5 శాతం మందే అనుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment