ఐదోసారి వచ్చిందని అప్‌సెట్ అయ్యారు!
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఒక సవరణ బిల్లును ఇప్పటి వరకు చట్టంగా మార్చకుండా పదేపదే ఆర్డినెన్స్‌గా తన వద్దకు పంపించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఒకటి కాదు రెండుకాదు.. ఒక ఆర్డినెన్స్‌గా రాష్ట్రపతి వద్దకు ఆ బిల్లు రావడం అది ఐదోసారి. ఇంతకీ ఏమిటా బిల్లు అని అనుకుంటున్నారా? శత్రువుల ఆస్తుల చట్టానికి సవరణ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ సవరణ బిల్లు ఆర్డినెన్స్‌కు ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ నాలుగుసార్లు ఆమోదముద్ర వేశారు.
గతంలో వచ్చినప్పుడే కేంద్రం ఇప్పటి వరకు ఈ ఆర్డినెన్స్‌ను ఎందుకు చట్టంగా మార్చలేదని ప్రశ్నించినట్లు సమాచారం. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. అంతేకాకుండా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర లేకుండానే ఆసమయంలో ఆయన వద్దకు అది వచ్చిందట. ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు నిర్ణీత కాలం తీరేలోగానే చట్టంగా మార్చుకుంటే మంచిదని, అలా కాకుండా ఇలా పదేపదే ఆర్డినెన్స్‌గా మంజూరుచేయించుకుంటే దొడ్డిదారిని ఆ చట్టాన్ని అమలు చేస్తున్నట్లవుతుందని కూడా రాష్ట్రపతి అన్నట్లు సమాచారం. ఈ చట్టం 48 ఏళ్ల కిందటిది. ఇందులో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ బిల్లు సవరణకు లోక్ సభ ఓకే చెప్పింది కానీ, విపక్ష సభ్యులు మాత్రం రాజ్యసభలో అడ్డుకున్నారు. దీంతో ప్రస్తుతం కేంద్రం ఆర్డినెన్స్ ద్వారానే అమలు చేస్తోంది.