
మోదీ విదేశీ పర్యటనలు ఎన్నో తెలుసా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పీఠం అధిష్టించినప్పటినుంచి ఇప్పటివరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. 2014 జూన్‌లో మొట్టమొదటిసారి ప్రధాని హోదాలో భూటాన్‌లో పర్యటించిన ఆయన.. అమెరికాను నాలుగు సార్లు, నేపాల్, రష్యా, అప్ఘానిస్తాన్, చైనా దేశాలను రెండు సార్లు చొప్పున సందర్శించారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు.
2014 సెప్టెంబర్‌లో మొదటిసారి అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లారు. వాషింగ్టన్‌తో పాటు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 2015 సెప్టెంబర్‌లో మళ్లీ న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లిన ప్రధాని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవ్వడంతో పాటు శాన్‌జోస్, కాలిఫోర్నియాలలో పర్యటించారు.
అలాగే ఫార్చ్యూన్ టాప్ 500 సీఈవోలతో సమావేశమయ్యారు. 2016లో మూడోసారి అమెరికా పర్యటనకు వెళ్లి వాషింగ్టన్‌లో జరిగిన అణు భద్రతా సదస్సులో పాల్గొన్నారు. అదే ఏడాది జూన్‌లో ఒబామా ఆహ్వానం మేరకు మళ్లీ యూఎస్ వెళ్లిన మోదీ.. అక్కడ యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. కాగా, 2014 ఆగస్టులో మోదీ నేపాల్‌లో పర్యటించారు. తద్వారా 17 ఏళ్ల తర్వాత పొరుగునే ఉన్న నేపాల్‌ను సందర్శించిన భారత ప్రధానిగా ఘనత వహించారు. జపాన్‌ను కూడా మోదీ రెండుసార్లు(2014, 2016) సందర్శించారు.
ఈ రెండుసార్లూ కూడా అక్కడ జరిగిన వార్షిక ద్వైపాక్షిక సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 2015 జూలైలో మొదటిసారి రష్యాకు వెళ్లారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌లో వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మళ్లీ రష్యాను సందర్శించారు. అలాగే 2015 మేలో, 2016 సెప్టెంబర్‌లో ప్రధాని చైనాలో పర్యటించారు. అంతేకాకుండా మంగోలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాను ప్రధాని సందర్శించారు.